AP Schemes: ఏపీ సర్కార్ కు ఈసీ ప్రశ్నలు- రూ.14 వేల కోట్లు ఎక్కడివి ? ఇవాళే ఎందుకు ?
ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు బదిలీపై ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే పథకాల మొత్తాల బదిలీకి బటన్లు నొక్కేసి ఇప్పుడు ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు రూ.14 వేల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ఈసీ ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల తర్వాత నగదు బదిలీ చేసుకోవాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పేసింది.
దీనిపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ ఒక్కరోజు మాత్రమే నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది. దీనిపై ఈసీ ఇవాళ హైకోర్టులో అప్పీలు చేసింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సలహా కోరింది. నగదు బదిలీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వ లేదు. దీంతో ఇప్పటికీ లబ్దిదారులకు నగదు బదిలీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది.

నగదు బదిలీ పథకాల డబ్బుల విడుదలకు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే బటన్ నొక్కి ఇప్పటివరకూ నగదు బదిలీ చేయకుండా ఎందుకు వేచి చూశారని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది. ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ఇందులో ప్రశ్నించింది. పథకాల నిధుల చెల్లింపునకు ఒక్కరోజే ఇన్ని నిధులు ఎలా వచ్చాయని నిలదీసింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈసీ ముందుంచాలని లేఖలో ఆదేశించింది.
పోలింగ్ తేదీకి ముందు రూ.14 వేల కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు ఎందుకు నగదు బదిలీ చేయలేకపోయారని, అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని కూడా అడిగింది. ఈ నేపథ్యంలో బటన్ నొక్కి చాలా రోజులైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications