కెసిఆర్ వ్యూహం: లేట్‌గానే కానీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చాలా ఆలస్యంగా ప్రవేశించినట్లు కనిపిస్తున్నారు. ఆయన వ్యూహం ప్రకారం ఇదే సరైన సమయం కావచ్చు. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి హడావిడి చేస్తూ పలువురు సెలబ్రిటీలను రంగంలోకి దించారు. దేశవ్యాప్తంగా సెలిబ్రిటీలు ఆ కార్యక్రమంలోకి దిగారు. హైదరాబాదులో కూడా సానియా మీర్జా వంటి స్టార్ క్రీడాకారులు, సినీ తారలు రంగంలోకి దిగారు. కానీ, కెసిఆర్ గానీ ఆయన పార్టీ నాయకులు గానీ దాన్ని పట్టించుకోలేదు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశం కూడా అయింది.
ఇప్పుడు కెసిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ అంటూ నినాదాన్ని ఎత్తుకుని నగరం వాడవాడలా పర్యటిస్తున్నారు. బస్తీలు కలియదిరుగుతున్నారు. నగరవాసులకు వరాల వర్షాలు కురిపిస్తున్నారు. మురికివాడలు లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నారు. మంచి ఇళ్లు కట్టిస్తానని హామీలు ఇస్తున్నారు. అధికారులనూ ఈ కార్యక్రమంలోకి దించారు. దీనివల్ల ఆయన రెండు ప్రయోజనాలు సాధించదలుచుకున్నట్లు అర్థమవుతోంది.
నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావిడి చేశారు. బిజెపికి టిడిపి మిత్రపక్షం కావడం, కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కూడా భాగస్వామి కావడం వల్ల ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి చంద్రబాబుకు అది కలిసి వచ్చే అంశంగానే మారింది. కానీ, అకస్మాత్తుగా ఇప్పుడు కెసిఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌ను చేపట్టడంలో ద్విముఖ వ్యూహం ఉందని అంచనా వేస్తున్నారు.

మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో త్వరలో జరగనున్నాయి. స్వచ్ఛ హైదరాబాదు ద్వారా ప్రజల మనసు దోచుకుని ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన సానుకూల వాతావరణాన్ని కల్పించుకోవడం కెసిఆర్ వ్యూహాల్లో ఒక్కటైతే, ఇటీవల కేంద్ర ప్రభుత్వానికీ బిజెపికీ మరింత దగ్గర కావడం రెండోది కావచ్చు. మోడీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో చేరే విషయంపై మోడీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని ఇటీవల టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత అన్నారు. బిజెపి, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారాన్ని టిఆర్ఎస్ నాయకులు కొట్టిపారేయడం లేదు.
అదే సమయంలో జిహెచ్ఎంసి ఎన్నికల కోసం కూడా కెసిఆర్ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తాజా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని టిడిపి, కాంగ్రెసు శాసనసభ్యులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, అది చాలా వరకు ఫలితం ఇచ్చిందని అందరికీ తెలుసు.
రాజకీయంగా ఇతర పార్టీలను బలహీనపరుస్తూ తన బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని అనుసరించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లడానికి తగిన కార్యక్రమంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆయన ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో ప్రజలను కలిసి, వారితో కలిసిపోయి తనను వారి వాడిగా పిలిపించుకోవడానికి కెసిఆర్ దాన్ని బలంగా ఉపయోగించుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications