మేం అడగలేదు: కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన టి కాంగ్రెస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంగళవారం నిప్పులు చెరిగారు. కెసిఆర్ నిరంకుశవాది అని, అవకాశవాది అని, అధికార దాహం ఉందని మండిపడ్డారు. కుటుంబ సభ్యులకు ఆరు టిక్కెట్లు ఇచ్చి ఓడిపోయే స్థానాలను అమరవీరుల కుటుంబాలకు ఇచ్చారన్నారు.
తెలంగాణ అభివృద్ధి కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. ఎంపీలు వివేక్, రాజయ్య తదితరులు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీని గెలిపించి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. తెరాసను విలీనం చేయాలని తాము ఎప్పుడు అడగలేదన్నారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని, తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది కాంగ్రెస్సే అన్నారు. కెసిఆర్‌ది అధికార దాహమని, కెసిఆర్ మాటలను ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ విషయంలో స్వపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించామని, మమ్మల్ని ద్రోహులనడం సరికాదన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు. అధికార దాహంతోనే కాంగ్రెస్‌ను కెసిఆర్ కాదనుకున్నారని మరో ఎంపీ గుత్తా సుఖేందర్ ఆరోపించారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావుల సెగ్మెంట్లలో అమరవీరుల కుటుంబాలకు ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ అంటే కెసిఆర్ ఫాంహౌస్ కాదని కాంగ్రెస్ నేత మధుయాష్కీ నిజామాబాదులో అన్నారు. తెరాసకు ఓట్లేస్తే దొరల పాలన వస్తుందని, తెరాస అంటే తెలంగాణ రావుల సమితి అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఆ పార్టీ కుటుంబ పార్టీ అని, అక్కడ కుటుంబ సభ్యులకు బంధువులకు మాత్రమే చోటు ఉంటుందని ఆయన అన్నారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకున్నది థర్డ్ ఫ్రంట్ పార్టీలోని నేతలేనని, వారిని నమ్మవద్దని మధుయాష్కీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అన్నారు. కెసిఆర్ థర్డ్ ఫ్రంటుతో కలుస్తాననడం విడ్డూరమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దళిత సిఎం హామీ ఏమైందన్నారు.












Click it and Unblock the Notifications