29వ రాష్ట్రంగా తెలంగాణ: సంబరాలుకు సర్వం సిద్ధం
హైదరాబాద్: కొత్త రాష్ట్రాల ఆవిర్భావానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్ చివరి దశకు చేరింది. ఆదివారం అర్ధ రాత్రే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొత్తగా ఆవతరించనున్నాయి. ఇన్నాళ్లూ 23 జిల్లాలతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదివారం అర్ధరాత్రి నుంచి 10 జిల్లాల తెలంగాణ, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవిస్తాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది.
ఆవిర్భావ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు సచివాలయం, ప్రధాన శాఖల్లో ఆదివారం సెలవును రద్దు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలంటూ ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతోపాటు తొమ్మిది వేలమంది ఉద్యోగులకూ అత్యవసరంగా ఆర్డర్ టు సర్వ్ ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇప్పటికే అఖిల భారత సర్వీసు అధికారుల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం, ఆదివారం ఉదయం ఉద్యోగులకూ ఆర్డర్ టు సర్వ్ పత్రాలు అందించనుంది. అలాగే తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆదివారం సాయంత్రం నుంచీ పూర్తిగా అందుబాటులో ఉండాలన్న ఆదేశాలూ జారీ అయ్యాయి.
అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్ల పంపకాలు, రాష్ట్రాల ఆవిర్భావ పనులను నిర్వహిస్తారు. అర్థరాత్రి రెండు రాష్ట్రాలు ఆవిర్భవించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన పనులు, కీలక ఫైళ్లపై సంతకాలు వంటివి కూడా అప్పుడే పూర్తి చేస్తారు. దీనికోసం కీలక ఫైళ్లను కూడా సిద్ధం చేస్తున్నట్టు సీనియర్ అధికార్లు వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జెండాలు వెలుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుండి సంబరాలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం కాంగ్రెస్, తెరాస, బిజెపి, టిటిడిపి, సిపిఐఎంల్ న్యూ డెమోక్రసి... ఇలా అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications