మంగళగిరి ఎన్నికల బరిలో తమన్నా .. ఇక అందరి చూపు మంగళగిరి వైపు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఊహించని పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రానికి పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇక ఏపీ రాజకీయాల్లో లోకేష్ పోటీ చేయడంతో మంగళగిరి స్థానం చాలా హాట్ టాపిక్ గా మారింది.
మంగళగిరి నుండి టీడీపీ తరఫున ఎన్నికల బరిలో సీఎం చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ రంగంలోకి దిగాడు. ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాడు. ఇక ఇదే మంగళగిరి నుండి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోమారు ఎన్నికల బరిలోకి దిగారు. ఇక టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన కాండ్రు కమల వైసీపీలో చేరి లోకేష్ కు షాక్ ఇచ్చింది. వైసీపీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పింది. దీంతో నవ్యాంధ్ర రాజధానిలోని కీలకమైన మంగళగిరి నియోజకవర్గం తాజా ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో మంగళగిరిపై అందరి చూపు పడింది.ఆయన్ను ఎలాగైనా ఓడిస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.
ఇక ఇదే క్రమంలో ఇక్కడి నుంచి ఓ ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ ఈమేరకు ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఇగ్నోలో బీసీఏ పూర్తి చేసిన తమన్నా ట్రాన్స్ జెండర్ ల కోసం , వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో , అలాగే ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చేయ్యనున్నారని తెలుస్తుంది. దీంతో నియోజకవర్గం పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించనుంది.












Click it and Unblock the Notifications