తారకరత్న గురించి వైద్యులు ఏమన్నారంటే..
బెంగళూరులోని నారాయణ హృదయాలయ లో నందమూరి తారకరత్న కు చికిత్స కొనసాగుతోంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంగళవారం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆయనకు మరికొన్ని పరీక్షలు అవసరమని, వాటిని నిర్వహించిన తర్వాతే హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆసుపత్రిలో తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులున్నారు.
సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తారకరత్నను ఐసీయూలో వెంటిలేటర్ మీదనే ఉంచి వైద్యం అందిస్తున్నట్లు నారాయణ వైద్యులు ప్రకటించారు. ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని తేల్చారు. మెదడుకు సంబంధించి చేసిన సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు రావాల్సి ఉందని, బుధవారం మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు నారాయణ హృదయాలయలో ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి బయటకు రావడంతో అది సోసోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన నందమూరి అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జనవరి 27వ తేదీన కుప్పంలోని వరదరాజస్వామి దేవాలయంవద్ద నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు లోకేష్ మామ బాలకృష్ణతోపాటు తారకరత్న, మరికొందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దేవాలయం, మసీదు, చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కుప్పంలో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి తర్వాత బెంగళూరుకు తరలించారు. బెంగళూరుకు తరలించే సమయంలో తారకరత్న కోసం గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు చంద్రబాబునాయుడు తదితరులు దగ్గరుండి వైద్యపరీక్షలను పర్యవేక్షించారు.













Click it and Unblock the Notifications