నేరుగా జగన్ కే టార్గెట్ పెట్టిన చంద్రబాబు..! పులివెందుల నుంచే గేమ్ మొదలు?
ఏపీలో అధికారంలోకి రాగానే గత వైసీపీ సర్కార్ అక్రమాలపై ఫోకస్ పెడుతున్న సీఎం చంద్రబాబు.. అన్ని శాఖల్లోనూ వీటిని వెలుగుతీసేందుకు అధికారులకు తగు ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అడ్డాగా భావించే పులివెందుల నియోజకవర్గంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రెండు అక్రమాలను గుర్తించారు. వీటిలో ఒక దానిపై విచారణకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అదే సమయంలో మరో అంశంపై సీఐడీకి టీడీపీ ఎమ్మెల్యేతో ఫిర్యాదు చేయించారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో అంతా జగన్, ఆయన అనుచరుల కన్నుసన్నల్లోనే సాగింది. దీంతో స్ధానికంగా జగనన్న మెగా లేఅవుట్ వేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా లబ్దిదారుల ఎంపిక చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణం జరగకుండానే హౌసింగ్ కార్పోరేషన్ నుంచి బిల్లులు కూడా తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్ధలాల్లో ఇళ్ల నిర్మాం కోసం 3 ఆప్షన్లు ఇచ్చింది. ఇందులో మూడో ఆప్షన్ అయిన తామే ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.

జగనన్న లేఅవుట్ లో మొత్తం 8400 ఇళ్లకు లబ్దిదారుల్ని ఎంపిక చేసి 6990 ఇళ్లకు పనులు అప్పగించారు. కానీ నిర్మించిన ఇళ్లు మాత్రం 99 మాత్రమే. కానీ రూ.84 కోట్ల బిల్లులు మాత్రం చెల్లించేశారు. వీటిపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అనర్హుల్ని లబ్దిదారులుగా ఎంపిక చేయడం, పనులు పూర్తి కాకుండా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభం కానుంది.
అలాగే ఇడుపులపాయ వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన 23 వైఎస్ విగ్రహాల వ్యవహారంపైనా విచారణ కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇడుపులపాయలో రూ.10 కోట్లతో మొత్తం 23 విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఇందులో ఒకే విగ్రహం కోసం 7.61 కోట్లు ఖర్చు పెట్టారని ఫిర్యాదులో బోండా తెలిపారు. మిగిలిన విగ్రహాలకు మిగిలిన డబ్బులు ఖర్చుపెట్టారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్దమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విగ్రహాల కోసం ఇతరులు టెండర్లు వేయకుండా వైసీపీ నేత కొండారెడ్డి బెదిరించిన వ్యవహారంపైనా విచారణకు సీఐడీ సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications