బాబు కుట్రలు, మోడీని తిట్టేదాకా ఊరుకోరు: భూమన, అంతా జగన్ వల్లే: జలీల్ ఖాన్
విజయవాడ: విశాఖలో జగన్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా, ప్రజలు దానిని విజయవంతం చేశారని, ఈ సభను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు, కుట్రలు చేసిందని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా ప్రజలు తమ మనోవేదనను వినిపించారని చెప్పారు. విశాఖ సభ విజయవంతం కావడం అధికార టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇంతకుముందు ఎన్నడూ ఇంత పెద్ద సభ జరగలేదన్నారు. దీంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన ప్రజలను జగన్ చైతన్యవంతులను చేస్తున్నారన్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభ తర్వాత , ఈ రోజు తెల్లవారకముందే ఓ మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్ పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు తిట్టలేదని సదరు మంత్రి ప్రశ్నించడం శోయనీయమన్నారు. మోడీని తిట్టకపోతే టిడిపి అంగీకరించే పరిస్థితి లేదని తెలుస్తోందన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా హోదా కోసం జగన్ చేసిన పోరాటం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. హోదా సాధించలేకపోయినందుకు ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.
వైయస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. ప్రజలు హోదా కోరుకుంటున్నారో లేదో నిన్నటి సభతో తేలిపోయిందన్నారు. చంద్రబాబు, వెంకయ్య ఏపీకి రాహుకేతువులుగా మారారన్నారు. లక్షా ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, ఎవరికి ఇచ్చారో పేర్లతో సహా బయటపెట్టాలన్నారు.
జగన్ వల్లే ఏపీ రెండు ముక్కలు: జలీల్ ఖాన్
వైసిపి అధినేత జగన్ వల్లే సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిందని ఎమ్మెల్యే, టిడిపి నేత జలీల్ ఖాన్ కృష్ణా జిల్లాలో నిప్పులు చెరిగారు. అవాకులు, చవాకులు పేలినంత మాత్రాన జగన్ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. విశాఖలో రాజకీయ నిరుద్యోగులు గొంతుచించుకొని ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచేస్తాడన్న భయంతో వైసిపికి, జగన్‌కు ప్రజలు పట్టం కట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications