చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్, ముహూర్తం మార్పు - ఇక పవన్ తో కలిసి..!!
ఏపీలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ ఇక గేర్ మార్చాల్సిందేనని పార్టీ నేతలకు నిర్దేశించారు. ఇటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమం తనకు మరోసారి అధికారం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సంక్షేమాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల మేనిఫెస్టోగా మార్చుతున్నారు. ఇక, టీడీపీ..జనసేన అధినేత లు ఈ అంశంలో కొత్త ఆలోచనలు చేస్తున్నారు.
రెండు పార్టీల పొత్తుతో : టీడీపీ అధినేతను జైలులో పరామర్శించిన పవన్ జైలు వద్దే పొత్తు ప్రకటించారు. వైసీపీ సంక్షేమం ఆయుధంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. వైసీపీ ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టిన టీడీపీ ఇప్పటికే సంక్షేమ మేనిఫెస్టోను పార్టీ మహానాడు వేదికగా ప్రకటించారు. దీనిని నేతలు బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ, ఆశించిన స్పందన రాలేదు. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమయంలోనే చంద్రబాబు అరెస్ట్...జనసేనతో పొత్తు ఖాయం కావటంతో ఇప్పుడు కొత్త ఆలోచనలు తెర మీదకు వస్తున్నాయి. దసరా నాడు పార్టీ పూర్తి మేనిఫెస్టో ప్రకటించాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

మేనిఫెస్టో ఆ తరువాతే : చంద్రబాబు అరెస్ట్..తదనంతర పరిణామాలతో టీడీపీలో కొత్త వాదన మొదలైంది. దసరా నాడు మేనిఫెస్టో ప్రకటన ఉండదనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తుండటంతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని చెబుతున్నారు. రెండు పార్టీలు వేర్వేరుగా కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. రెండు పార్టీల నుంచి సమన్వయం కోసం కమిటీలను ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీలో మేనిఫెస్టో పైన ఇప్పటికే ప్రాధమిక కసరత్తు జరిగింది. పవన్ సైతం తన వారాహి యాత్రల్లో హామీలు ఇస్తున్నారు. రెండు పార్టీలు అధికారంలోకి వస్తే అమలు చేసే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పోరాటాలతో : చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ కలవనున్నారు. రెండు పార్టీల సమన్వయ కమిటీలు సమావేశమై సీట్ల ఖరారు..ప్రచారం..ప్రభుత్వం పైన చేయాల్సిన ఉమ్మడి పోరాటాల పైన కార్యాచరణ సిద్దం చేయనున్నారు. ఇక, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది రెండు పార్టీల ఆలోచన. ఢిల్లీలో ఉన్న లోకేశ్...జనసేనానితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. 3వ తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు..బెయిల్ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, అక్టోబర్ తొలి వారం తరువాత రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ అమలు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications