సినీఇండస్ట్రీ వాళ్లకు ఇప్పటికి నొప్పి తెలిసింది; నానీలాగా అన్యాయంపై పెద్దహీరోలు నోరువిప్పాలి: టీడీపీ అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. తాజాగా సినిమా టికెట్ల ధరల పై టాలీవుడ్ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల కంటే కిరాణా షాపులలో కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని హీరో నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను పక్కన పెడితే ఇదంతా ప్రేక్షకులను అవమానించడమేనని చెప్పుకొచ్చారు. టికెట్ ధర పెంచిన కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని నాని పేర్కొన్నారు .ప్రేక్షకులకు సినిమా చూపించటమే తన లక్ష్యమని లాభనష్టాలు మాత్రం తర్వాత చూసుకుంటాము అని వెల్లడించారు.

హీరో నానీకి థాంక్స్ చెప్పిన అనిత
ఇక తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ వేశారు. ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచుతాం అంటే ఊరుకునేది లేదని, టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇలా ఉంటే టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. హీరో నానికి థాంక్స్ చెబుతున్నానని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై నాని చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు అనిత.

ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ వాళ్లకు నొప్పి తెలిసింది
సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందంటూ వ్యాఖ్యానించారు. రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదని పేర్కొన్న అనిత, ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదు అనుకున్నాడో లేక భయపడ్డారో కానీ సినిమా వాళ్లు స్పందించలేదు అంటూ వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకింది కాబట్టి హీరో నాని వంటి వారు స్పందించారు అంటూ అనిత వెల్లడించారు.

పెద్ద హీరోలు సీఎం జగన్ ను కలిసి వెళ్ళటం కాదు, అన్యాయం ప్రశ్నించాలి
పెద్ద హీరోలు విజయవాడ వచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డిని, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదని, సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయంపై నాని లాగా పెద్ద హీరోలు నోరు విప్పాలని వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల సినీ పరిశ్రమ కు నష్టం వాటిల్లుతుందని కొందరు హీరోలు ఇప్పటికే లబోదిబోమంటున్నారు అని అనిత పేర్కొన్నారు. అన్ని రంగాలను జగన్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

నాని ఇంట్లో మహిళలను వైసీపీ నేతలు టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు
హీరో నాని ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాడని, కాబట్టి నాని ఇంట్లో మహిళలను సైతం వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారంటూ, అలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అశోక్ గజపతి తల్లిని తిట్టిన మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద లెక్క కాదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినా తగ్గించిన దాఖలాలు ప్రభుత్వానికి లేవని కానీ సినిమా టికెట్ ధర విషయంలో మాత్రం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు వంగలపూడి అనిత .

సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తేనే ప్రజలను ఉద్దరించినట్టా?
సినిమా టికెట్ల ధరలు తగ్గించి ప్రజలను ఉద్దరించినట్లు ప్రభుత్వం చెబుతోందని ఆమె పేర్కొన్నారు. మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేయించుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ ఇండస్ట్రీ సమస్యల మీదనే కాకుండా ఇతర సమస్యల పైన కూడా హీరో నాని తోపాటు సెలబ్రిటీలు స్పందించాలని వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications