చంద్రబాబు ఇంట్లో ఎన్డీయే సీట్ల చర్చలు ! కాసేపట్లో ఫైనల్ ..?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇవాళ సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించాయి. గతంలోనే టీడీపీ, జనసేన మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చల్లో దాదాపుగా సీట్లు ఖరారైపోగా.. ఇప్పుడు బీజేపీ ఎంట్రీ కారణంగా అందులో కొన్ని సీట్లపై తకరారు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆదేశాలతో ఆ పార్టీ దూతలు గజేంద్రసింగ్ షెకావత్, ఎంపీ పాండా ఇవాళ చంద్రబాబు ఇంటికి వచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చలు ప్రారంభించారు. రాష్ట్రంలో కొన్ని ఎంపీ సీట్లలో బీజేపీ పోటీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖను తమకు వదిలిపెట్టాలని బీజేపీ గట్టిగా కోరుతుండగా.. చంద్రబాబు మాత్రం ససేమిరా అంటున్నారు. కావాలంటే పక్కనే ఉన్న అనకాపల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే విజయవాడ సీటు కోసం కూడా బీజేపీ పట్టుబడుతోంది. పక్కా అర్బన్ సీట్లు కావడంతో ఈసారి మోడీ హవాలో వీటిని సునాయాసంగా గెల్చుకోవచ్చనేది కమలనాథుల అంచనా.

జనసేనకు ఇప్పటికే రెండు ఎంపీ సీట్లు ఖరారు చేశారు. దీంతో బీజేపీ ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. ఇందులో హిందూపురం, రాజంపేట, తిరుపతి, విశాఖ లేదా అనకాపల్లి, రాజమండ్రి, అరకు సీట్లను కోరుతోంది. వీటిని ఇవాళ జరిగే చర్చల్లో చంద్రబాబు, పవన్ ఖరారు చేయాల్సి ఉంది. వీరిద్దరూ ఓకే అంటే బీజేపీ ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చినట్లే. మొన్న బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు సందర్భంగా వెలువడిన సంయుక్త ప్రకటనలోనూ రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై ప్రకటన చేస్తామని చెప్పారు. దీంతో ఇవాళ సాయంత్రానికి సీట్ల లెక్కలు తేలిపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications