బీజేపీ వేగంగా కదులుతోంది, ఎదుర్కోవాలి - చంద్రబాబు హెచ్చరిక..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. మూడు నెలల విరామం తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ తో కలిసి సభల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ సిద్దం అవుతోంది. అటు బీజేపీ వైఖరిని గమనిస్తున్నారు. నవ్ ఆర్ నెవర్ గా మారుతన్న ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు పార్టీ ఇంఛార్జ్ లకు కీలక మార్గదర్శకం చేసారు. బీజేపీ ఆలోచనలపైన స్పష్టత ఇచ్చారు.
మారుతున్న సమీకరణాలు : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో వచ్చినా రావచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా ఎన్నికలు ఎప్పుడో ఏప్రిల్‌లో వస్తాయని నింపాదిగా ఉండొద్దని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేగంగా కదులుతోందని చెప్పారు. ఫిబ్రవరి చివరిలోనే పోలింగ్ వచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదన్నారు. లేదా మార్చి మొదటివారంలో రావచ్చని అప్రమత్తం చేసారు. ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉందన్న విషయాన్ని గమనంలోకి తీసుకుని ఇన్‌చార్జులు నిరంతరం ప్రజల్లో ఉండాలని గట్టిగా కోరారు.

ఇంఛార్జ్ లకు హెచ్చరిక : ఓటర్ల జాబితా ప్రక్షాళన మనకు కీలకమైన అంశంగా చంద్రబాబు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఏమున్నా శనివారంలోపు లిఖితపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌లో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద దాఖలు చేయాని నిర్దేశించారు. ఈ విషయంలో బద్దకించవద్దని స్పష్టం చేసారు. అధికార పార్టీ వైసీపీ ప్రజల మద్దతు కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలతో గెలవాలని చూస్తోందన్నారు. ఆ ప్రయత్నాన్ని గట్టిగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ అధికారాలు చాలా పెద్దవని... తెలంగాణలో డీజీపీని కూడా సస్పెండ్ చేశారని చంద్రబాబు గుర్తు చేసారు. మనం ప్రతి అక్రమాన్నీ దాని దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వాటిపై చర్యలు తీసుకునేలా మన పోరాటం మనం చేద్దామని చంద్రబాబు సూచించారు.

తెలంగాణ ఫలితాలతో మార్పు : ప్రజలతో నిత్య సంబంధాలు ఉంటే వారే గెలిపిస్తారని చంద్రబాబు స్పష్టం చేసారు. ఎవరు వచ్చినా కలవడానికి మన ఇంటి తలుపులు తీసి ఉండాలని సూచించారు. వారితో మమేకమై పనిచేయాలని స్పష్టం చేసారు. అహంభావం పనికిరాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో అది ఎటువంటి ప్రభావం చూపించిందో మీరంతా చూశారని చెప్పుకొచ్చారు. అహంభావం ప్రదర్శించిన వారు ఇళ్లకు పోయారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్నవారు గెలిచారని చెప్పారు. గత రెండ్రోజులుగా అక్కడేం జరుగుతోందో కూడా చూడాలన్నారు ప్రజలను కలవడానికి మనం నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూలగొట్టింది. ప్రజలు సీఎంను కలవడానికి అడ్డుగా ఉన్న ఇనుప కంచెలను తెలంగాణ సర్కారు తొలగించిందని వివరించారు. ఈ రెంటినీ ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని వివరించారు. జనం తగిన సమయంలో తమ తీర్పును బలంగా ఇస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications