వై నాట్ పులివెందుల ? 175సీట్లలో వైసీపీని ఓడిస్తాం- వైజాగ్ జోనల్ సదస్సులో చంద్రబాబు...
విశాఖలో ఇవాళ జరిగిన టీడీపీ జోన్ 1 సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు, అనంతర పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా ఎదుర్కొంటామన్న దానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంతో వైసీపీ సర్కార్ పాలనను పోలుస్తూ కార్యకర్తల్ని ఉత్సాహ పరిచారు.
మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది శాంపిల్ గెలుపు మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో పెద్ద విజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు మద్దతు పలికి గెలిపించారన్నారు.

ఒక గెలుపు విజయం ఇస్తుంది...ఒక గెలుపు కుంగదీస్తుందంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పార్టీకీ జోష్ ను ఇచ్చిందన్నారు. వైసీపీ అంటున్నట్లు వై నాట్ 175 కాదు...ఇప్పుడు చెపుతున్నా వై నాట్ పులివెందుల అన్నారు.
టీడీపీతో పెట్టుకున్న జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలను జగన్ నిన్నటి వరకు హీనంగా చూశాడని, ఇప్పుడు వారికి గౌరవం ఇస్తాను అంటున్నాడని గుర్తుచేశారు. మనకు గత ఎన్నికల్లో 23 సీట్లు వస్తే ఇది దేవుడి స్క్రిప్ట్ అని హేళన చేశాడని, అందుకే దేవుడి ఆ స్క్రిప్ట్ తిరగరాశాడన్నారు.
23వ సంవత్సరం...23 వ తేదీ 23 ఓట్లతో మన ఎమ్మెల్సీ గెలిచారు. ఇదీ దేవుడి స్క్రిప్ట్ అని చంద్రబాబు పేర్కొన్నారు.మొన్నటి వరకు 80 మంది ఎమ్మెల్యే లను తీసేస్తాను అన్నాడని, ఇప్పుడు బాబ్బాబు అంటున్నాడని, జగన్ కు వెన్నెముకలో వణుకు పుట్టిందని చంద్రబాబు తెలిపారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గెలిచే అవకాశమే లేదని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రభుత్వ ఎక్సైపైరీ టైం వచ్చిందన్నారు.మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి...ఇప్పుడు ఎమ్మెల్యేలను గౌరవిస్తా అంటున్నాడన్నారు.
ఈ నాలుగేళ్లు తెలుగు దేశం పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టబద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు.....వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుందన్నారు. మేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తామన్నారు.












Click it and Unblock the Notifications