Chandrababu : ఈసారి కుప్పంలో మెజార్టీపై చంద్రబాబు అంచనా ఇదే....!
ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఈసారి గెలుస్తారా లేదా ఆన్న చర్చ జరుగుతున్న వేళ ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పరిస్ధితులు మారుతున్నాయన్న అంచనాల మధ్య వరుస పర్యటనలు చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో స్ధైర్యం నింపే పనిలో బిజీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ మరోసారి కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఏం జరగబోతోందో చెప్పేశారు.
కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇవాళ రెండోరోజు కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కుప్పంలో ఈసారి అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. కుప్పం అభివృద్ధి చెందాలంటే మరోసారి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. అదే సమయంలో ఈసారి కుప్పంలో మెజారిటీపైనా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కుప్పంలో ఈసారి టీడీపీ లక్ష మెజారిటీ సాధించాలని చంద్రబాబు కోరారు. తద్వారా తనకు ఈసారి లక్ష మెజారిటీ రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు. కుప్పంలో వరుస పర్యటనలు చేయడం ద్వారా క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబు ఇప్పటివరకూ మెజారిటీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కుప్పంలో ఎలాగో తానే గెలుస్తానన్న ధీమాగా ఉన్నారు. ఈసారి మాత్రం చంద్రబాబు తొలిసారి తన మెజారిటీ గురించి మాట్లాడారు.
ఈసారి ఎన్నికలకు తొమ్మిది నెలలు మాత్రమే గడువుతుందని చంద్రబాబు కార్యకర్తలకు గుర్తుచేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ కుప్పం నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురుతూనే ఉందని ఆయన తెలిపారు. ఇక్కడి ప్రజలు కూడా నీతి, నిజాయితీపరులని అన్నారు. అలాంటి నియోజవర్గం అభివృద్ధి కావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా టీడీపీ గెలవాలని చంద్రబాబు కోరారు. తనను మరోసారి గెలిపిస్తే కుప్పంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications