జగన్ ఓట్ బ్యాంక్‌పై చంద్రబాబు గురి - అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జగన్ సొంతం చేసుకున్న ఓట్ బ్యాంక్ పై ఇప్పుడు చంద్రబాబు గురి పెట్టారు. ఇందు కోసం 45 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. జగన్ నిర్ణయాలను.. కార్యాచరణనే ఫాలో అవుతున్నారు. అదే దారిలో ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడే అసలు లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
జగన్ ఓట్ బ్యాంక్ పై గురి: ముఖ్యమంత్రి జగన్ 2019 అధికారంలోకి వచ్చిన సమయం నుంచే 2024 ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవటం పైన పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయలేదు. తన పథకాలన్నీ మహిళలకే లబ్ది దారులుగా అమలు చేసారు.

ఇప్పుడు ఆ పథకాలే తిరిగి తమకు అధికారం దక్కేలా చేస్తాయని వైసీపీ విశ్వసిస్తోంది. జగన్ సీఎం అయిన ఈ 50 నెలల కాలంలో 2.43 లక్షల కోట్ల మేర లబ్ది పథకాల లబ్దిదారులకు అందించారు. అర్హత ఉండి పథకాలు అందుకులేకపోతున్న వారిని జగనన్న సురక్ష పేరుతో స్పెషల్ డ్రైవ్ చేసి గుర్తించారు. వారికి పథకాలు అమలు ప్రారంభించారు. అన్ని రకాల సంక్షేమంతో జగన్ ఓట్ బ్యాంక్ బలంగా కనిపిస్తోంది.
సంక్షేమమే ఎన్నికల ఆయుధంగా: ఇప్పటి వరకు జగన్ అమలు చేసిన సంక్షేమం పైన ఆరోపణలు చేసిన చంద్రబాబు రూటు మార్చారు. జగన్ బాటలోనే పయణిస్తున్నారు. సంక్షేమం పేరుతో జగన్ పై చేయి సాధించారని గుర్తించారు. దీంతో, తాను సంక్షేమ బాట పట్టాలని నిర్ణయించారు. మహానాడు వేదికగా ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇందుకు 45 రోజుల షెడ్యూల్ ప్రకటించారు. వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న తరహాలోనే ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. పథకాలు వర్తించేవారు ఇంట్లో ఎందరున్నారో వివరాలు నమోదు చేసుకొని..వారికి టీడీపీ అధికారంలోకి వస్తే జరిగే మేలుతో ఒక బాండ్ ఇవ్వాలని నిర్ణయించారు. మూడు కోట్ల మంది ఓటర్లను కలవాలని లక్ష్యంగా నిర్ణయించారు.
వైసీపీ వర్సస్ టీడీపీ: ఈ తరహా ప్రచారం ద్వారా ప్రతీ గడకు పార్టీ నేతలను చేరువ చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజల్లో తమ హామీలు బాగా ప్రచారం పొందుతాయని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, దాదాపు ఏడాదికి పైగా వైసీపీ నేతలు, శ్రేణులు ఇప్పటికీ ప్రతీ ఇంటిని రెండు నుంచి మూడు సార్లు సందర్శించారు. పథకాల అమలు పైన వాకబు చేసారు. సమస్యలు ఉన్న చోట పరిష్కరించారు. ఇక, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని వైసీపీ బలంగా ప్రచారం చేసింది.

చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీసింది. పొరుగు రాష్ట్రాల సంక్షేమాన్ని కాపీ కొట్టిందని విమర్శిస్తోంది. తాము ప్రతీ ఇంటికి సంక్షేమం అందించి ఇప్పటికే ప్రతీ ఇంటా గుర్తింపు సాధించామని వైసీపీ చెబుతోంది. దీంతో, జగన్ ఓట్ బ్యాంక్ కోసం అదే తరహాలో ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications