ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు నిర్ణయం..!?
ఎన్నికల వేళ చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకునేందుకు చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ నుంచి అధికారికంగా దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసారంటూ పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపైన ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
నెల్లూరుకు చంద్రబాబు: 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి వైసీపీ ను అక్కడ దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వరుసగా జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు..ఈ రోజు నెల్లూరులో ప్రాంతీయ సమావేశంలో పాల్గొంటారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
అయిదు పార్లమెంట్ స్థానాల పరిధిలోనే పార్టీ నేతలు..క్లస్టర్ ఇంఛార్జ్ లు హాజరవుతున్నారు. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ,రాజంపేట పార్లమెంట్ స్థానాలకు చెందిన నేతలు పాల్గొంటారు. ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి ప్రక్రియపై శ్రేణులకు శిక్షణ పైన చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

చంద్రబాబు కొత్త లెక్కలు: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఆ ముగ్గురు క్రాస్ ఓటింగ్ చేసినట్లు నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని జిల్లాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ముగ్గురు టీడీపీలో చేరిక..సీట్ల కేటాయింపు పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీలో చేరటానికి అభ్యంతరాలు లేవని, సీట్ల విషయంలో మాత్రం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను టీడీపీ నుంచి పోటీ చేయటం పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని ఓపెన్ గానే చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పట్టు సాధఇంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
ముగ్గురి పైనా తేల్చేస్తారా :ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తరువాత చంద్రబాబు తొలి సారి నెల్లూరు వస్తున్నారు. జిల్లాలో నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ రెబల్స్ ముగ్గురు ఎమ్మెల్యేల అంశం పైన జిల్లా నేతలతో చంద్రబాబు ప్రస్తావన చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో నెల్లూరులో సీట్ల ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. నెల్లూరు అర్బన్ సీటు మాజీ మంత్రి నారాయణకు ఖరారు చేసారు.
రూరల్ సీటు కోటంరెడ్డి ఆశిస్తున్నారు. అదే విధంగా ఆనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు సీట్ల పైన ఫోకస్ చేసారని ప్రచారం. మేకపాటి చంద్రశేఖర రెడ్డి పోటీ పైన ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో ఈ ముగ్గురు గురించి చంద్రబాబు ఎటువంటి సంకేతాలు ఇస్తారు.. ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications