తగ్గేదేలే.. చంద్రబాబు సంచలన ప్రకటన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో రెండురోజుల నుంచి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.

ఆశ్చర్యానికి గురిచేసిన చంద్రబాబు ప్రకటన
చంద్రబాబు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ వ్యూహం ప్రకారం ఆ ప్రకటన చేశారా? అనే దీర్ఘాలోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఒకవైపు జనసేనతో పొత్తు దాదాపు ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఏడాది సమయమే ఉంది. ఇటువంటి తరుణంలో 175 నియోజకవర్గాలను గెలుచుకోవాలనడం అంటే.. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న వైనాట్ 175కు కౌంటర్ ఇవ్వడానికి ఈ వ్యాఖ్య చేశారా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గౌరవం తగ్గకుండా చూడాలంటున్న పవన్
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా పొత్తులతో ముందుకు వెళతామని చెబుతున్న పవన్ కల్యాణ్ రణస్థలంలో జరిగిన సభలో మాట్లాడుతూ తమకు కూడా గౌరవం తగ్గకుండా, మర్యాద పెంచేలా సీట్లివ్వాలని, అటువంటి గౌరవం దక్కితేనే ముందుకు వెళతామని ప్రకటించారు. మరోవైపు చంద్రబాబునాయుడుతో పవన్ పొత్తులకు సంబంధించి దోబూచులాడుతున్నారా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. దీనికి విరుగుడుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను గెలిచితీరతామని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా దానిపై చర్చ
తెలుగు తమ్ముళ్లందరినీ విస్మయానికి గురిచేసిన చంద్రబాబు ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. మరోవైపు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా 160 నియోజకవర్గాలను గెలుచుకుంటామని చెబుతున్నారు. వైసీపీ వైనాట్ 175 వ్యూహానికి విరుగుడగా, దానికి చెక్ పెట్టేల చంద్రబాబు వ్యాఖ్యానించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైందని ఇరుపార్టీల శ్రేణులు భావిస్తున్న తరుణంలో చంద్రబాబు నోటినుంచి వచ్చిన మాట వారిని విస్మయానికి గురిచేసింది. మున్ముందు ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారో? ఎటువంటి ప్రకటనలు చేస్తారో? అనే సందిగ్ధంలో టీడీపీ శ్రేణులున్నాయి.












Click it and Unblock the Notifications