స్పీకర్ సహా కేంద్రంలో టీడీపీ అడుగుతున్న శాఖలివే..? ఎన్డీయే భేటీలో క్లారిటీ..!
ఈసారి ఏపీ ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఘన విజయం జాతీయ స్ధాయిలో ఆ పార్టీకి చాలా కాలం తర్వాత ఎక్కడ లేని ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. ఇప్పుడు కేంద్రంలో ఏర్పడుతున్న మూడో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రధాని మోడీ, అమిత్ షా ముందు కీలక డిమాండ్లు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు కేంద్రంలో మంత్రి పదవులతో పాటు స్పీకర్ పోస్టును టీడీపీ డిమాండ్ చేస్తోంది.
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా 16 సీట్లతో టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో ఈసారి తమకు కీలకమైన నాలుగు మంత్రి పదవులు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రవాణా, వ్యవసాయం, జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వశాఖల్లో నాలుగు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎన్డీయే కూటమి భేటీలో నిర్ణయం తీసుకుందామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. అయితే టీడీపీ కేంద్రంలో చేరే ఉద్దేశంలో లేదనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.

మరోవైపు టీడీపీ తర్వాత ఎన్డీయే కూటమిలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన జేడీయూ సైతం కీలక శాఖలకు పట్టుబడుతోంది. ముందు లోక్ సభ స్పీకర్ పోస్టు ఇవ్వాల్సిందేనంటోంది. దీంతో జేడీయూ, టీడీపీల్లో ఒకరికి తప్పనిసరిగా స్పీకర్ పోస్టు ఇవ్వాల్సిన పరిస్ధితి ఎన్డీయే ముందు ఉంది. దీని తర్వాత కేంద్రంలో కీలక శాఖల్లో మంత్రులుగా టీడీపీ, జేడీయూ ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈసారి కేంద్ర కేబినెట్ కూర్పు కూడా ఆసక్తికరంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications