ఉద్దేశమేంటో గానీ.. పులివెందులకు చంద్రబాబు థ్యాంక్స్
కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. తొలుత కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించారు. రోడ్ షోల్లో ప్రసంగించారు. ఇవ్వాళ కడప జిల్లాలో అడుగుపెట్టారు. నంద్యాల మీదుగా ఆయన కడప జిల్లాలో ఎంట్రీ ఇచ్చారు. జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందులల్లో రోడ్ షో నిర్వహించారు.
రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించిపోయిందనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యాటనను చేపట్టారు. ప్రాజెక్టులను సందర్శించడానికి ఈ పర్యటనను తలపెట్టారు. పెన్నా టు వంశధార పేరుతో దీన్ని నిర్వహిస్తోన్నారు. నందికొట్కూరులో ముచ్చుమర్రి - బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. రోడ్ షోలో పాల్గొన్నారు.

నంద్యాల, కోవెలకుంట్ల మీదుగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చేరుకున్నారు. రోడ్ షోలో భాగంగా తొలుత జమ్మమడుగు టౌన్‌లో, అనంతరం పులివెందులలో ప్రసంగించారు. సింహాద్రిపురం మీదుగా నుంచి పులివెందులకు చేరుకున్నారు. కొండాపురంలో గండికోట ఎత్తిపోతల విస్తరణ పనులను ఆయన పరీశీలీంచారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును ప్రస్తావించారు. వలంటీర్లు, డేటా చోరీ విషయాలనూ చంద్రబాబు తన ప్రసంగంలో వివరించారు. తన హయాంలో పులివెందులకు నీటి సరఫరాను కల్పించానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. పులివెందుల సభ అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
తన సభను విజయవంతం చేసినందుకు పులివెందులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయం మారుతోందంటూ ధీమా వ్యక్తం చేశారాయన. ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతోందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచే నిరసనలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
నాటి నిరసనల ఇప్పుడు ఉద్యమంలా మారిందని, ఉప్పెనలా వైసీపీని ముంచెత్తబోతోందంటూ చంద్రబాబు జోస్యం చెప్పారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే తన పులివెందుల సభ అంటూ చెప్పారు. ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు. థాంక్యూ పులివెందుల అంటూ ట్వీట్ ముగించారు.












Click it and Unblock the Notifications