
పశ్చిమగోదావరి పర్యటనలో చంద్రబాబు నేర్చుకున్నదేంటి?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో ప్రజలకు తన ప్రసంగాల్లో వివరిస్తున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు పర్యటనలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం రోడ్ షోలు చేస్తున్నారు. వీటిల్లో పార్టీ శ్రేణులతోపాటు స్థానిక ప్రజలు కూడా భారీగా పాల్గొంటున్నారు. దెందులూరు నుంచి చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో రోడ్ షో చేశారు. తర్వాత తాడేపల్లి గూడెం, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగబోతోంది.

పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లే
ప్రజల స్పందనను చూసి తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఒక్క నియోజకవర్గాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. దెందులూరులో బలపడటమే కాకుండా గోపాలపురం, పోలవరం, కొవ్వూరు, చింతలపూడి స్థానాల్లో మెరుగుపడ్డామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గోపాలపురంలో వెంకట్రాజును ఇన్ఛార్జిగా పెట్టినప్పటికీ మిగిలిన స్థానాల్లో ఇన్ చార్జిలు ఎవరనేదిపార్టీ శ్రేణులకు స్పష్టత లేదు. ఒకరికి మించి నాయకులు ఇక్కడ పోటీపడుతున్నారు. బలమైన నాయకులకు ఇన్ ఛార్జి పదవి ఇస్తే ఈ మూడుస్థానాల్లో గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి.

మహిళా ఓట్లపై చంద్రబాబు గురి
మహిళా ఓట్లే టార్గెట్ గా బాబు తన పర్యటన చేస్తున్నారు. సంక్షేమ పథకాల రూపంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే ప్రస్తుత ప్రభుత్వం నగదు వేస్తుండటంతో మహిళలు ఎక్కువగా జగన్ వైపు మొగ్గుచూపుతారనే అంచనా ఉంది. ఈ పర్యటనలో చంద్రబాబు మహిళా ఓట్లపై గురిపెట్టారు. కొవ్వూరులోని డ్వాక్రా, అంగన్ వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

4 సంవత్సరాల్లో పెరిగిన ఖర్చులు
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, అమల్లో మాత్రం గడప దాటడంలేదన్నారు. ఇచ్చే డబ్బుకు, దోచుకునే డబ్బుకు పొంతన ఉండటంలేదన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో ఇంటి ఖర్చులు ఎంత పెరిగాయో మహిళలంతా బేరీజు వేసుకోవాలని కోరారు. కొనుగోలు శక్తి రానురాను తగ్గిపోతోందన్నారు.
కేవలం తన సభలకు హాజరు కావడం కోసమే డ్వాక్రా సంఘాలను వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపై కూడా పన్ను వేసిన ఘనత ముఖో్యమంత్రికి దక్కుతుందన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటున్నారు.
ఏతావాతా గోదావరి పర్యటనలో చంద్రబాబుకు అర్థమైన విషయం ఏమిటంటే.. ఒకరికి మించి నాయకులున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను త్వరిగతిన ఫైనల్ చేస్తే పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని తెలుసుకున్నారు. కేంద్ర కార్యాలయానికి తిరిగి వెళ్లిన తర్వాత గోదావరి ఒక్కటే కాకుండా అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆయన చేయబోతున్న పని కూడా ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.