'కంచుకోట'లపై చంద్రబాబు సమరభేరి
వచ్చే ఎన్నికల్లో విజయమే ఏకైక లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తట్టుకొని టీడీపీని అధికారంలోకి తీసుకురావడం అంత సులువేం కాదు. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ-వైసీపీ మధ్య భీకర సంగ్రామం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబును కుప్పంలో ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జగన్ ను పులివెందులలో ఓడించాలని చంద్రబాబు.. ఇలా రకరకాల ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నారు.
కుప్పంలో తనను ఎప్పుడైతే టార్గెట్ చేశారో.. అప్పటి నుంచి చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చారు. వైసీపీకి బలమైన నియోజకవర్గాలన్నింటిలో రోడ్ షోలు నిర్వహించడంతోపాటు పార్టీ కచ్చితంగా గెలిపించేలా వ్యూహరచన చేశారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే తనను టార్గెట్ చేశారని, కానీ రాయలసీమతో సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీని ఓడించాలనే పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. తన వ్యూహంలో భాగంగా వైసీపీ కంచుకోటల్లో చంద్రబాబు ఇదేం ఖర్మ, బాదుడే బాదుడు పేర్లతో వరుసగా రోడ్ షో చేసుకుంటూ వస్తున్నారు.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు ఈనెల 10వ తేదీ నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో రోడ్ షో చేయడంతోపాటు భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు. అనంతరం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో తన పర్యటన పెట్టుకున్నారు. ఇవన్నీ వైసీపీకి పట్టున్న స్థానాలు. వీటిల్లోనే పట్టు సాధించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి విశాఖపట్నం జిల్లాలో బాబు పర్యటన ఉంది. అది కూడా వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే కావడం గమనార్హం. ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైన తర్వాతే చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతమయ్యాయో తెలుస్తుంది. అప్పటివరకు వేచిచూడటమే.












Click it and Unblock the Notifications