కీలక విషయమై ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 28వ తేదీన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలుస్తారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాల తరహాలోనే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓట్లు తొలగించారనే విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు తొలగించడంపై ఆయన ప్రధానంగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా అందజేయనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదులను అధికారులెవరూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలు కూడా వస్తుండటంతో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. అక్రమాలు నివారించటంతో పాటు బాధ్యులైన ప్రతి అధికారిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరనున్నారు.

ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ పట్టించుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కావాలనే.. ఉద్దేశపూర్వకంగానే అనేకచోట్లకు ఓట్లను మారుస్తున్నారని, పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను నకిలీ డోర్ నెంబర్లు, నకిలీ చిరునామాలతో ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా తెలపనున్నారు. దీని విషయమై ఇప్పటికే ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై ఫిర్యాదులను నియోజకవర్గాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని నిర్ణయించారు. మరోవైపు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావు వందో జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో ఆయన స్మారకార్థం ప్రత్యేక నాణేలను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉంది. అదే రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలవనున్నారు. ఈమేరకు ఆయన అపాయింట్ మెంట్ కోరుతూ ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా పంపించారు.












Click it and Unblock the Notifications