Chandrababu : ఆగస్టు 1 నుంచి చంద్రబాబు సీమ టూర్-టార్గెట్ ప్రాజెక్టులు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతలు జనం వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏదో విధంగా జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీతో పోలిస్తే విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ ఈ పనిలో చాలా బిజీగా ఉంటున్నారు. ఇందులో భాగంగా విపక్ష నేత చంద్రబాబు త్వరలో రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులే లక్ష్యంగా చంద్రబాబు ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని ఆ పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు ఇవాళ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగస్టు 3న గండికోట రిజర్వాయర్ పరిశీలిస్తారన్నారు. అనంతరం అనంతపురం జిల్లాకు చంద్రబాబు వస్తారన్నారు. ఆగస్టు 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్‌లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారని శ్రీనివాసులు తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జగన్ సర్కార్ చేస్తున్న నిర్లక్ష్యంపై చంద్రబాబు ఒత్తిడి పెంచేలా ఈ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

గత ఎన్నికల్లో రాయలసీమ నుంచి అత్యధిక సీట్లు గెలిచిన వైసీపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు టూర్ సాగబోతోంది. ముఖ్యంగా ఇక్కడ వేరుశెనగ పంట దిగుబడి తగ్గడం, ఇతర పంటలకు నీరు అందకపోవడం, ప్రాజెక్టులు పూర్తి కాని వైనాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఈ టూర్ ప్లాన్ చేశారు. చంద్రబాబు టూర్ లో భారీ ఎత్తున రైతుల్ని పోగేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు రైతులు భారీగా పాల్గొని చంద్రబాబు టూర్ విజయవంతం చేయాలని కాల్వ శ్రీనివాసులు కోరారు.
రాయలసీమ జిల్లాల్లోని పలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే బీజేపీ సైతం రాయలసీమలో ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు టూర్ కూడా ప్లాన్ చేయడంతో ఆ మేరకు ఒత్తిడి పెరగబోతోంది.












Click it and Unblock the Notifications