ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాల్సిందే-మహానాడులో చంద్రబాబు డిమాండ్
కరోనా సందర్భంగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో పార్టీ వ్యవస్ధాపకుడు, దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మహానాడులో రెండురోజు నేతల్ని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన విధానాల్ని, రాష్ట్రానికిఅందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహానాడులో రెండోరోజు మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనో వ్యక్తి కాదు వ్యవస్ధ అన్నారు. ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలన్నారు. అప్పుడే మనల్ని మనం గౌరవించికున్నట్లు అవుతుందన్నారు. మహానాడు ద్వారా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు అందరూ పునరంకితం అవుదామన్నారు. ఎన్టీఆర్ సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి అసాదారణ సాధనతో వ్యవస్ధగా మారారని చంద్రబాబు గుర్తుచేశారు.

తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని చంద్రబాబు తెలిపారు. అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం టీడీపీని పెట్టారన్నారు. ఆడబిడ్డలందరూ ఎన్టీఆర్‌ను అన్న అని పిలిచారని చంద్రబాబు గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళా యూనివర్సిటీ నెలకొల్పడం వంటి ఎన్నో చర్యలు తీసుకున్నారన్నారు. స్ధానిక సంస్ధల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను మొదటిసారి ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని చంద్రబాబు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని, రెండు రూపాయలకే కిలో బియ్యం, ఇళ్ల నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలలు ఎన్టీఆర్ తీసుకొచ్చారన్నారు.
ఎన్టీఆర్ తెలుగుగంగ ద్వారా రాయలసీమతో పాటు చెన్నైకు తాగునీరు ఇచ్చారని, మానవత్వమే నా సిద్ధాంతమని కుండబద్దలు కొట్టిన వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. బీసీలను, యువతను రాజ్యాధికారంలో భాగం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. మాతృభాషలోనే ప్రాధమిక విద్య ఉండాలని నిపుణులు చెప్తున్నారని, తెలుగును వదిలి ఇంగ్లీష్‌ను తీసుకురావడం ఎప్పుడూ జరగలేదన్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలన్నారు. మాండలిక వ్యవస్ధ ద్వారా ఎన్టీఆర్ ఇంటివద్దకే పాలన తీసుకొచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. అవినీతిపరులకు ఎన్టీఆర్ సింహస్వప్నమని, టీడీపీని ఇప్పటికీ ఎవరూ వేలెత్తి చూపకపోవడానికి ఎన్టీఆర్ స్ఫూర్తే కారణమన్నారు.












Click it and Unblock the Notifications