ఎమ్మెల్సీ పోరులో వైసీపీకి సాయం ! ఏయూ వీసీ, కడప ఆర్జేడీపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు..
ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి అధికారులు సాయం చేస్తున్నారంటూ ఇవాళ ఎన్నికల ప్రధానాధికారిని టీడీపీ మరోసారి ఆశ్రయించింది.
ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అధికారుల సాయం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేయడం, ఓట్ల నమోదులో అక్రమాల ఆరోపణల్ని ఇద్దరు అధికారులు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఇవాళ టీడీపీ నేతలు మరోసారి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.
ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-సీఈవో) ముకేష్ కుమార్ మీనాను టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు,ఎమ్మెల్సీ అశోక్ బాబు, బుచ్చి రామ్ ప్రసాద్ కలిశారు. ఏపీలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు ఓట్లనే తారుమారు చేస్తుందని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ ముఖేష్ మీనాను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ఉపాధ్యాయ, పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకతవకల గురించి వినతి పత్రం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. కడప జిల్లా ఆర్జేడీ ప్రతాపరెడ్డి తీరుతో పాటు ఆంధ్రాయూనివర్శిటీ వీసీ ప్రసాదరెడ్డిపై వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స లర్ ప్రసాద్ రెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు.. అతనిని వీసీ అనేకంటే విజయసాయిరెడ్డి చెంచా అనటం బాగుంటుందన్నారు.
మహామహులు చదివిన యూనివర్సిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు వైస్ ఛాన్సరల్ గా పని చేసిన యూనివర్సిటీని ఇప్పుడు ఈ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చివేశాడని టీడీపీ నేతలు ఆరోపించారు. నిన్న వైజాగ్ లో ఒక ప్రైవేట్ హోటల్లో ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలతో మీటింగ్ ఏర్పాటు చేసి వైసీపీకి ఓటు వేయాలి లేకపోతే మీకు ఇబ్బందులు తప్పవు అని వీసీ మాట్లాడటం దారుణమన్నారు. వామపక్ష ప్రజా సంఘాలు ఆ హోటల్లోకి వెళ్లి వీడియో తీస్తుంటే వంట గదిలో నుంచి వీసీ పారిపోయాడన్నారు. ఇదే విషయం సీఈవోకి ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు.












Click it and Unblock the Notifications