'రోజాపై జీవితకాలపు సస్పెన్షన్': టిడిపి లోకేష్ తాతది.. రాజేంద్రప్రసాద్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా పైన జీవితకాలం బహిష్కరణ వేటు వేయాలని మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం నాడు మండిపడ్డారు. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా క్షణాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించిన రోజా పైన జీవితకాలం నిషేధం విధిస్తేనే బాగుంటుందని మండిపడ్డారు. కాగా, రోజా బుధవారం ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో.. రోజా క్షమాపణ చెప్పారని ప్రివిలేజ్ కమిటీ, చెప్పలేదని రోజా చెప్పడంతో కొత్త సమస్య వచ్చింది.

ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన రోజా పైన ఏం చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ అందరిలోను కనిపిస్తోంది. ఆమె వివరణను రికార్డు చేసుకున్న ప్రివిలేజ్ కమిటీ దానిని సభాపతికి ఇవ్వనున్నారు. ఇప్పుడు కోర్టు స్పీకర్ లేదా అధికార పార్టీ చేతిలోనే ఉంది.
తెలుగుదేశం లోకేష్ తాతదే: రాజేంద్రప్రసాద్
తెలుగుదేశం పార్టీ... పార్టీ యువనేత నారా లోకేష్ తాతదేనని,రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఆయన పోటీ చేసినా, లక్ష ఓట్లకు పైగా మెజారిటీ ఖాయమని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

కృష్ణా జిల్లాలోని పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా నారా లోకేష్ బరిలోకి దిగి గెలవవచ్చునని చెప్పారు. ఆయనకు క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇస్తే, యువతకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుందన్నారు. చంద్రబాబు కృషితో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు.












Click it and Unblock the Notifications