
లోకేష్ అంటే జగన్ కు భయమా ? హోం మినిస్టర్ డమ్మీ ; పోలీసులపైనా అనిత ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లే ముందు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా గొల్లపాలెం లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ పర్యటన చేయనున్న నేపథ్యంలో ఆయనను అడ్డుకోవడానికి వేలాదిగా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ టిడిపి నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇక ఈ పరిస్థితులపై ఏపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు .
వచ్చే
ఎన్నికల్లో
దళిత
ప్రతిఘటన
ఓట్లు
జగనే
కాదు,
రాజారెడ్డి
వచ్చినా
అడ్డుకోలేరు
:
అనిత,
సుజాత
ధ్వజం

లోకేష్ ను అడ్డుకోవటానికి వేలాది పోలీసులు, మహిళల రక్షణకు ఎక్కడ ఉన్నారు?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను గృహనిర్బంధం చేయడానికి, నారా లోకేష్ కార్యక్రమాలు అడ్డుకోవడానికే పోలీసులు సరిపోతున్నారని, ఇక సామాన్య ప్రజలను ఎవరు కాపాడతారు, సామాన్యులకు రక్షణ ఏది? అంటూ వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. లోకేష్ ను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారని, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ వేలాది మంది పోలీసులు ఎక్కడికి పోతున్నారు ? వారిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అంటూ అనిత ప్రశ్నించారు. ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నారా లోకేష్ కు పోలీసులు అనుమతి నిరాకరించటం అన్యాయమని, వేలాదిగా పోలీసులను రంగంలోకి దించి పహారా కాయాల్సిన అవసరం ఏముంది అంటూ అనిత పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

జగన్ సర్కార్ లోకేష్ కు భయపడుతుందా ?
టిడిపి నాయకులను గృహనిర్బంధం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడిన అనిత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ఆపే దమ్ము లేదా అంటూ ప్రశ్నించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి నరసరావుపేట వరకు భారీగా పోలీసులు మోహరించారు అంటే జగన్ సర్కార్ లోకేష్ కు భయపడుతుందా అని ప్రశ్నించారు. చేతగాని ప్రభుత్వమని ఒప్పుకోమని అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో దారుణాలకు గురవుతున్న ఆడపిల్లలకు న్యాయం చేయండి అంటే చేయకపోగా, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై చర్యలు తీసుకోమని అడుగుతున్నందుకు నిర్బంధాలకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

జగన్ తాడేపల్లి కొంప నుండి బయటకు రాడు .. మహిళలపై దాడులపై స్పందించడు
జగన్మోహన్ రెడ్డి మహిళలపై, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అనిత అసహనం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప నుండి బయటకు రావడం లేదని, జగన్ ఇంటికి కూతవేటు దూరంలో సీతానగరం వద్ద దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగినా జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవని అనిత విమర్శించారు. పక్క రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ దిశపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశా చట్టాన్ని తీసుకు వచ్చిన సీఎం జగన్ ఏపీ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా స్పందించకపోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు మాటల్లో, ప్రచారంలో ఉన్న దిశా చట్టం ఏపీలో అమల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు .

హోం మినిస్టర్ డమ్మీ .. సత్తెనపల్లి ఘటనపై ఫైర్.. జీరో ఎఫ్ఐఆర్ లు ఎక్కడ ?
హోమ్ మినిస్టర్ ఒక డమ్మీ హోమ్ మినిస్టర్ అని, రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. నిన్న రాత్రి గుంటూరు జిల్లాలో బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి దుండగులు మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కనీసం సత్తెనపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా బాధితులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. జీరో ఎఫ్ఐఆర్ లను ఎక్కడ పెట్టుకున్నారు అంటూ హోంమంత్రిని నిలదీశారు వంగలపూడి అనిత. జీరో ఎఫ్ఐఆర్ లను చెత్తబుట్టలో పడేశారా అంటూ ప్రశ్నించారు.
లోకేష్ చేస్తుంది జగన్ లా సీఎం కుర్చీ కోసం ఓదార్పు యాత్రలు కాదు
ఫ్రెండీ పోలీస్, జీరో ఎఫ్ఐ ఆర్ లు మాటలకే పరిమితమా అని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం చెయ్యాల్సిన అవసరం లేదా అని నిప్పులు చెరిగారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకోవటంలో శ్రద్ధ పెట్టకుండా ఎప్పుడు చూసినా టీడీపీ నాయకులను అడ్డుకోవటంపైనే దృష్టి సారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. లోకేష్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిలా సీఎం కుర్చీ కోసం చేస్తున్న ఓదార్పు యాత్ర కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం చేస్తున్న పోరాటమని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
పోలీసులు ప్రగల్భాలు మానేసి ఉద్యోగాలు మానెయ్యాలని ఫైర్
ఇక పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ, ప్రగల్భాలు పలకడం మానేయాలని, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించ లేకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇళ్లల్లో కూర్చోవాలని సూచించారు అనిత. లోకేష్ అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని అనిత నిలదీశారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా గోళ్ళపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా అనుమతులు లేవని పేర్కొన్నారు. లోకేష్ ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

పోలీసుల అరెస్ట్ పై లోకేష్ ధ్వజం
పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదని బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్నాను అని చెప్పిన పోలీసులు వినిపించుకోవడం లేదని లోకేష్ మండిపడ్డారు. కావాలనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడం పై పెట్టిన శ్రద్ధ, మహిళలను రక్షించడం పై పడితే రాష్ట్రం బాగు పడుతుందని లోకేష్ జగన్ సర్కారును విమర్శించారు.