జగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ముగిసిన పంచాయితీ ఎన్నికలతోపాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీనే విజయం సాధిస్తుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 13.095 గ్రామ పంచాయితీలు ఉండగా, దాదాపు స్వీప్ ఫలితాలతో వైసీపీ ఏకంగా 10,524 స్థానాలను కైవసం చేసుకోవడం, ప్రతిపక్ష టీడీపీ కేవలం 2,063 స్థానాలకే పరిమితం కావడానికి గల కారణాలను జేసీ విపులీకరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యం, ప్రస్తుత రాజకీయాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ప్రధానమంత్రిలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..

జనానికి కావాల్సింది డబ్బే..
‘‘పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వాళ్లు క్లీన్ స్వీప్ చేశారా, చేయలేదా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ, మేం చేసిన అభివృద్ధిని చూసే జనం ఓట్లేశారని జగన్ పార్టీ వాళ్లు చెప్పుకోవడం మాత్రం ముమ్మాటికీ దొంగ మాటే. నిజానికి వైసీపీ అభివృద్ధి పనులు చేసి ఉండొచ్చు లేదా చేయకుండా ఉండొచ్చు. అయితే ప్రజలకు ఇవేవీ పట్టవు. వాళ్లకు కావాల్సింది డబ్బులు మాత్రమే. నా పదవీ కాలంలో ఒక కుటుంబానికి చాలా సాయం చేశాను. వాళ్ల కొడుక్కి ఉద్యోగం కూడా పెట్టించా. అతను కూడా విశ్వాసంతో నా మనిషే అన్నట్లుగా మెలిగేవాడు. కానీ మొన్న ఎన్నికల్లో మా వాళ్లు డబ్బులు పంచుతూ, ఆ వ్యక్తి ఇంటిని వదిలేసినందుకు తెగ ఫీలైపోయాడు. ఏం? నా ఓటు వద్దా? నాకు డబ్బులు ఇవ్వరా? అని నిలదీశాడు. అదీగాక..

కులం ప్రభావం లేనేలేదు..
గతానికి భిన్నంగా ఈసారి పంచాయితీ ఎన్నికల్లో కులం ప్రభావం అసలే పనిచేయలేదు. కేవలం డబ్బు, మద్యం మాత్రమే ప్రభావం చూపాయి. దీనికితోడు పోలీసుల దమనకాండ. ‘ఏరా, ఎన్నికల ప్రచారం చేస్తున్నావా? లోపలేస్తే దివాకర్ రెడ్డి విడిపిస్తాడా? లేక చంద్రబాబే వస్తాడా? ఎవడొచ్చిన ముందు మీ వీపులు పగిలిన తర్వాతేకదరా' అని పోలీసులు బెదిరించారు. కాబట్టి, వైసీపీ గెలుపు కేవలం అభివృద్ది వల్లే సాధ్యమైంది అనేది దొంగమాట. ఆ మాటకొస్తే, కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం తక్కువ చేశాడు? వ్యవసాయం, ఉపాధి, నీళ్లు, ఉద్యోగాలు, రోడ్లు, బదిలీలు.. ఒక్కటేంటి? కుప్పంను చంద్రబు అన్ని రకాలుగా ముందుంచాడు. కానీ ఇవాళ ఆయనక్కడ ఓడిపోయాడు. దానికి కారణం..

ప్రధానమంత్రికీ డబ్బులు కావాలి..
అధికార వైసీపీ వాళ్లతో పోటీపడి డబ్బులు పంచలేకనే చంద్రబాబు కుప్పంలో ఓడిపోయాడు. రేపు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు ఎలాంటివాడో రాష్ట్రప్రజలకు తెలుసు. జగన్ ఎలాంటివాడో ఇంకా బాగా తెలుసు. జగన్ ఒక్కరోజు ఆదాయమే రూ.300 కోట్లు వస్తుందని జనం చెబుతున్నారు. అది నిజమా, అబద్దమా పైనున్న దేవుడికి, కిందున్న జగన్ కు మాత్రమే తెలియాలి. అంత డబ్బుతో ఎవరు పోటీ పగలరు? చంద్రబాబు దగ్గర డబ్బు లేకే కుప్పంలో వెల్లకిల్లా పడిపోయాడు. ప్రస్తుతం ప్రధానమంత్రి కూడా జనానికి డబ్బులు పంచకుండా ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనేలేదు. నిజానికి ఇవన్నీ చూస్తుంటే.. మనకీ ప్రజాస్వామ్యం అససరం లేదనిపిస్తోంది. దాని బదులు..

దెయ్యాలకు పుట్టాం.. కల్తీ నెత్తురు..
చిన్న ఎన్నికల ప్రక్రియలో ఇన్ని దారుణాలా? అలాగైతే ఎందుకీ ప్రజాస్వామ్యం? అది అవసరమా? మరో ప్రత్యామ్నాయ మార్గం కనుగొనాలి. మన పూర్వీకులు నీతి నిజాయితీలు కలిగినవాళ్లు కాబట్టి, మనం కూడా అలాంటి ఆదర్శాలతోనే ఉండాలని ఈ వ్యవస్థలు పెట్టారు. కానీ ప్రస్తుతం నాయకులుగా ఉన్న మేము అసలు మనుషులకే పుట్టామా? లేక దెయ్యాలు, రాక్షసులకు పుట్టామా? అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ బతికున్న సంతతి ఒంట్లో పారేది మానవ రక్తమా? లేక కల్తీ నెత్తురా? అని అనుమానం కలుగుతోంది. మన దేశంలో అసలు ఎన్నికలే లేకుండాపోతే..

ఆన్ ది స్పాట్ కాల్చిపారేయాలి..
అక్రమ పద్ధతిలో ఎన్నికలు జరిపి, దీన్నే ప్రజాస్వామ్యం అనుకుంటే కంటే.. ఈ దేశంలో ఎన్నికలే లేకపోతే.. ఎవడో ఒక నియంత వస్తాడు. లక్షల కోట్లు సంపాదించుకుంటాడు. ఎంత పోగేసినా, అది హిందూ మహాసముద్రంలో నీటి బొట్టులానే అనిపిస్తుంది. కళ్లుండీ చూడలేకపోవడం, వాస్తవాలను గ్రహించలేమనడానికి తాజా ఉదాహరణ.. పెద్దపల్లి అడ్వొకేట్ దంపతుల హత్య. ఆ కేసులో అన్ని రకాల ఆధారాలున్నాయి. నరికి చంపుతున్న వ్యక్తులను జనమంతా టీవీల్లో చూశారు. అయినాకూడా ఇంకా విచారణ ఏంటి? ఆన్ ది స్పాట్ వాళ్లను కాల్చిపారేయాలి. తద్వారా సత్వర న్యాయం లభిస్తుంది. మన దేశంలో ఇమ్మీడియట్ జస్టిస్ లేదు కాబట్టే పరిస్థితి ఇలా తయారైంది. కొన్ని రోజుల తర్వాత సాక్ష్యులకు, బాధితులు డబ్బులు తీసుకుని మాట తిరగేస్తారు. దేశంలో మారాల్సినవి చాలా ఉన్నాయి'' అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
viral video: ఈ నేతను గుర్తుపట్టారా? -ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా మోపెడ్‌పై..