దళితులపై పేటెంట్ హక్కులన్నీ టిడిపివే:మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు:రాష్ట్రంలో దళితులపై పేటెంట్ హక్కులన్నీ తెలుగుదేశం పార్టీ వేనని ఎపి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు తేల్చిచెప్పారు. గుంటూరులో జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం దళితతేజం-తెలుగుదేశం సన్నాహక సమావేశం సందర్భంగా మంత్రి నక్కా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 30 న నెల్లూరులో దళితతేజం-తెలుగుదేశం కార్యక్రమం జగరనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకుగాను పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే చర్యల్లో భాగంగా టిడిపి ఈ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వం దళితుల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను మంత్రి నక్కా ఆనందబాబు వివరించారు.

టిడిపినే...చేసింది
దళితుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో గడచిన 40 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలను కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే చంద్రబాబు అమలు చేశారని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా స్వాతంత్య్రం వచ్చాక దేశంలోనే ఏ పార్టీ చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెదేపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేసిందన్నారు.

జయప్రదం...చేయండి
అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 323 మంది దళితులను ఎంపిక చేసి విదేశాలకు పంపడం జరిగిందన్నారు. వై.ఎస్ హయాంలో రూ.16,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. టిడిపి ప్రభుత్వం దళితులకు చేసిన మేలు తెలిసేలా ఈ నెల 30న నెల్లూరులో జరిగే దళితతేజం-తెలుగుదేశం బహిరంగ సభను జయప్రదం చేయాలని మంత్రి నక్కా పిలుపునిచ్చారు.

టిడిపిని కాపాడటం...ప్రతి దళితుడి బాధ్యత
టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి ఆంజనేయులు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి పాటుపడ్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనన్నారు. అటువంటి టిడిపి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్క దళిత సోదరుని పై ఉందన్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే దళితవాడల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు.

చంద్రబాబుకు...అండగా నిలవాలి
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో మాత్రం సిఎం చంద్రబాబు ఏ లోటు రానివ్వడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఆయనకు అండగా నిలవాలన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కమార్ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేది ఒక్క టిడిపినే అన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు దళితుల సంక్షేమానికి రూపొందించారని చెప్పారు.












Click it and Unblock the Notifications