తెలివిగా పవన్ కల్యాణ్ ను ఇరికించిన BJP!
టీడీపీతో పొత్తుండదని బీజేపీ తన కార్యవర్గ సమావేశాల్లో అనధికారికంగా డిక్లరేషన్ ఇవ్వడంద్వారా పొత్తుల బంతిని తెలివిగా పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టింది. బీజేపీతో ఉండాలా? లేదా?
భారతీయ జనతాపార్టీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భీమవరంలో జరిగాయి. 24, 25 తేదీల్లో జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ నేతలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై అనధికారికంగా డిక్లరేషన్ ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీకి తాము సమదూరం పాటిస్తామని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ప్రజలతోనే తమకు పొత్తుంటుందన్నారు. అయితే సమావేశాల్లో బీజేపీ నేతలెవరూ తమతో అధికారికంగా పొత్తున్న జనసేన గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇది కొంత ఆశ్చర్యకరం.

పవన్ కల్యాణ్ పై ఒత్తిడి
పొత్తును కొనసాగించాలా? లేదంటే బీజేపీ లేకుండా టీడీపీతోనే కలిసి వెళ్లాలా? అనేది తాజాగా పవన్ కల్యాణ్ నిర్ణయంపై ఆధారపడివుంది. బీజేపీ నేతలు తెలివిగా బంతిని పవన్ కోర్టులోకి నెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆ పార్టీ అండ తీసుకొని ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నారు. అందుకే టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీని ఒప్పించే బాధ్యత తాను తీసుకున్నారు. కానీ వైసీపీ, టీడీపీలకు తాము సమదూరం పాటిస్తామని బీజేపీ నేతలు ప్రకటించడంద్వారా పొత్తుండదని స్పష్టమైంది.

బీజేపీలోనే రెండు వర్గాలు
పొత్తుల గురించి చివరగా నిర్ణయించేది ఢిల్లీ అధినాయకత్వమైనప్పటికీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం కూడా తీసుకుంటుంది. ఇప్పటికే బీజేపీలో రెండు వర్గాలున్నాయి. ఒకవర్గం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లి గౌరవప్రదమైన సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలుచుకుందామని ప్రస్తావిస్తుండగా, మరోవర్గం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుతో పొత్తుండదని తేల్చేయడంతోపాటు పవన్ కల్యాణ్ కు బీజేపీతో పొత్తు కావాలా? వద్దా? తేల్చుకోవాలంటూ పరోక్షంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు సూచనలు చేశాయని భావిస్తున్నారు.

తక్కువ సీట్లపై బీజేపీ నేతల ఆగ్రహం?
విశాఖపట్నం పరిణామాలు జరిగిన తర్వాత విజయవాడలోని హోటల్ లో పవన్ కల్యాణ్ ను కలిసిన చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు. ఆ సమయంలోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల గురించి చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే బీజేపీతో చివరి నిముషంలో పొత్తు ఖరారైతే ఎన్ని సీట్లివ్వాలనే విషయమై చంద్రబాబు పవన్ కు చెప్పారని, ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా అంత తక్కువస్థాయిలో సీట్లిస్తామనే చర్చ జరగడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీతో పొత్తు వద్దనడమే కాకుండా పవన్ కల్యాణ్ ను కూడా బీజేపీతో పొత్తు కావాలో? వద్దో? తేల్చుకోవాలని సవాల్ విసిరినట్లైంది.












Click it and Unblock the Notifications