టీడీపీపై పవన్ జలక్ , తెర వెనుక ఏం జరిగింది - తగ్గాల్సిందెవరు..!!
పవన్ కల్యాణ్ వ్యూహం మారింది. స్వరంలో మార్పు వచ్చింది. టీడీపీతో పొత్తు ఖాయం వేళ కొత్త రాజకీయం ఆరంభమైంది. టీడీపీకి పవన్ తీరు అంతుచిక్కటం లేదు. తన పట్టు నిరూపించుకొనే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. గౌరవప్రదమైన పొత్తు కావాలని కోరుకుంటున్నారు. వైసీపీ పైన పోరాటం నిర్ణయంలో మార్పు లేదు..అదే సమయంలో టీడీపీతో అన్నింటికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది.
పవన్ వ్యూహంలో మార్పు:పవన్ పదే పదే చెప్పే వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. పొత్తుల గురంచి దాదాపు క్లారిటీ ఇచ్చేసిన పవన్ లో ఇప్పుడు అదే పొత్తుల పైన వాయిస్ మారుతోంది. పొత్తుల విషయంలో పార్టీ నేతలను..కేడర్ ను ఒప్పించేలా అవసరాన్ని పవన్ గతంలో వరస సమావేశాల్లో వివరించారు.

టీడీపీ తో పాటుగా బీజేపీతోనూ కలిసి వెళ్లేలా ఢిల్లీ వెళ్లి మరీ చర్చలు చేసారు. ఇప్పుడు వారాహి యాత్రలో మాత్రం మార్పు కనిపిస్తోంది. ఇంకా పొత్తులతో వెళ్లాలా.. ఒంటరిగా వెళ్లాలా అనేది తేలలేదని చెబుతున్నారు. పొత్తుల విషయంలో టీడీపీతో తేడా వచ్చిందనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు ఖాయమే అని చెబుతున్నా...పవన్ తన పట్టు నిరూపించకొనే విధంగా అడుగులు వేస్తున్నారు.
టీడీపీ తీరే కారణమా:పవన్ తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని..2024,2029 ఎన్నికల్లో జనసేనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడా టీడీపీ, బీజేపీ ప్రస్తావన చేయటం లేదు. పొత్తుల గురించి మాట కూడా మాట్లాడటం లేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికి టీడీపీ తీరే కారణంగా చెబుతున్నారు. టీడీపీతో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్న సమయంలో మహానాడు వేదికగా టీడీపీ ఏకపక్షంగా మేనిఫెస్టో ప్రకటన చేయటం పవన్ కు నచ్చలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఉమ్మడి అభిప్రాయాలకు విలువ ఇస్తూ మేనిఫెస్టో ప్రకటించాల్సిన సమయం లో..తమను విస్మరించి ఏకపక్షంగా ప్రకటన చేయటం జనసేనానికి నచ్చలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు దీని కారణంగానే టీడీపీ మేనిఫెస్టో పైన జనసేన స్పందించలేదని చెబుతున్నారు.

టీడీపీ తగ్గాల్సిందేనా:టీడీపీ, బీజేపీతో పొత్తు కోసం తాను సీఎం పదవి రేసులో లేననే విధంగా అభిమానులకు పవన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆలోచనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తనకు సీఎం గా అవకాశం ఇవ్వాలని పదే పదే పవన్ కోరుతున్నారు. దీని ద్వారా టీడీపీపైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు.
పొత్తుకు ముందే టీడీపీకి తన విలువ తెలిసేలా చేయటం పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఫలితంగా సీట్ల పంపకం.. గౌరవం పెరిగేలా పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబు రాజకీయంలో పావుకు కాదని చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. తన పట్టు నిరూపించుకుంటూనే టీడీపీ అవసరమైన సమయంలో తగ్గి పొత్తు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చేయటమే పవన్ వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications