దారుణంగా కొట్టుకున్న టీడీపీ-జనసేన శ్రేణులు-ఎందుకో, ఎక్కడో తెలుసా ?
ఏపీలో ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసి విజయం సాధించిన టీడీపీ, జనసేన పార్టీల మధ్య క్షేత్రస్ధాయిలో ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లోనూ గొడవలు తప్పడం లేదు. ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇందులో టీడీపీ, జనసేన శ్రేణులు పరస్పరం దారుణంగా దాడులు చేసుకున్నాయి. ఇందులో పలువురికి గాయాలు కూడా అయ్యాయి.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇందుకు వేదికైంది. స్థానికంగా ఉన్న జనసేన మద్దతుదారు అయిన సర్పంచ్ కూటమిలో ఉన్న టీడీపీ నేతల్ని పిలవకుండా ఏకపక్షంగా పెన్షన్ల పంపిణీ చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అలాగే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు జిల్లాలో ఇప్పటికే టీడీపీ, జనసేన ద్వితీయశ్రేణి కార్యకర్తల మధ్య పలుచోట్ల పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరులోనూ అదే పరిస్ధితి. దీంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో కార్యకర్తలు మాత్రం ఊరుకునే పరిస్ధితి లేకపోవడంతో ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు కూడా ఎవరిపై కేసులు పెట్టాలో తెలియక తలపట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications