Vijayawada : విజయవాడ ఎంపీ సీటు పరిధిలో టీడీపీ-జనసేన సీట్లు, అభ్యర్ధులు ఇలా ?
ఏపీలో కీలకమైన విజయవాడ ఎంపీ సీటు పరిధిలో వచ్చే ఎన్నికల కోసం విపక్ష టీడీపీ-జనసేన కూటమి మధ్య పొత్తు, సీట్ల పంపకాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీటిలో విజయవాడ ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులపై ఇరు పార్టీలు ఓ అవగాహనతో ముందుకెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు నిలబెట్టుకోవడంతో పాటు దీని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లలో క్లీన్ స్వీప్ చేయాలని వీరు భావిస్తున్నారు.
విజయవాడ ఎంపీ సీటులో ప్రస్తుతం టీడీపీ ఎంపీ కేశినేని నాని సిట్టింగ్ గా ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానంతో విభేదిస్తున్న ఆయన స్ధానంలో సోదరుడు కేశినేని శివనాథ్(చిన్ని)కి లోక్ సభ సీటు దాదాపుగా ఖరారైంది. చివరి నిమిషంలో ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప కచ్చితంగా ఈసారి చిన్ని విజయవాడ నుంచి లోక్ సభకు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఎంపీ సీటులో తాము పోటీ చేయకుండా టీడీపీకి జనసేన మద్దతివ్వబోతోంది.

అలాగే విజయవాడ ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ-జనసేన పొత్తుతో ఎమ్మెల్యే సీట్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. వీటిలో ముందుగా విజయవాడ నగర పరిధిలోకి వచ్చే పశ్చిమ సీటుని ఈసారి జనసేన అభ్యర్ధి పోతిన మహేష్ కు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సీటులో వెల్లంపల్లిపై పోరులో పోతిన మహేష్ చాలా ముందున్నారు. ఆయనకు పోటీగా టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఆయన కుమార్తె పేరు పరిశీలించినా పొత్తులో జనసేనకు ఇవ్వబోతున్నారు.
మరోవైపు విజయవాడలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే సీటు తూర్పు నియోజకవర్గం నుంచి మరోసారి సిట్టింగ్ గద్దె రామ్మోహన్ బరిలోకి దిగడం ఖాయమైంది. గత ఎన్నికల్లో సెంట్రల్ సీటులో స్వల్ప తేడాతో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మరోసారి పోటీ చేయడం ఖాయమే. ఇక జగ్గయ్యపేట సీటులో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) బరిలోకి దిగుతారు. నందిగామ రిజర్వుడు సీటులో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పోటీ పడనున్నారు. మరో రిజర్వుడు సీటు తిరువూరులో దేవదత్తుకు సీటు లభించే అవకాశముంది.

చివరిగా గతంలో టీడీపీ వరుస విజయాలు సాధించి 2019లో ఓడిపోయిన మైలవరం సీటులో టికెట్ కోసం మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆయనకు బదులుగా ఎన్నికలకు ముందు టీడీపీలోకి వస్తారని భావిస్తున్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు దీన్ని కేటాయించబోతున్నారు. దేవినేని ఉమను బందరు లోక్ సభ పరిధిలోకి వచ్చే విజయవాడ శివారు నియోజకవర్గం పెనమలూరుకు పంపే అవకాశముంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications