టీడీపీ-జనసేన మరో అడుగు-ఉమ్మడి కమిటీపై కసరత్తు ..! ఈ నెల్లోనే భేటీ ?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు వేదికగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇరు పార్టీలు తదుపరి చర్యలపై దృష్టిపెట్టాయి. ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటవుతుందని పవన్ ప్రకటించిన తర్వాత.. జనసేన విస్తృత స్ధాయి భేటీలో నాదెండ్ల మనోహర్ తమ పార్టీ తరఫున దీనికి నేతృత్వం వహిస్తారని కూడా వెల్లడించారు. ఇప్పుడు టీడీపీ కూడా తమ సభ్యుల కోసం కసరత్తు చేస్తోంది.
రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుతో ఇవాళ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ కానున్నారు. ఈ భేటీలో టీడీపీ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండబోయే సభ్యుల్ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ రాజకీయాల్లో కీలకంగా ఉండే యనమలతో పాటు మరికొందరు సభ్యుల్ని జాయింట్ యాక్షన్ కమిటీకి ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నేతలకు చోటు కల్పించనున్నారు.

మరోవైపు జనసేన వైపు నుంచి పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఆయనతో పాటు కమిటీలో జనసేన తరఫున ఎవరెవరు ఉండాలనే దానిపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో జనసేన తరఫున పనిచేసే సభ్యుల జాబితాను కూడా ఆ పార్టీ విడుదల చేయబోతోంది. అలాగే తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబుతో జరిగే ములాఖత్‌లో చర్చించిన అనంతరం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయ్యాక ఈనెలలోనే తొలి సమావేశం జరిగే అవకాశముంది. దీంతో సాధ్యమైనంత త్వరలో క్షేత్రస్ధాయిలో ఉమ్మడి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications