టీడీపీ 6-జనసేన 4- టార్గెట్ 160గా నవంబర్ 1న టీజర్...
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ రాజమండ్రిలో తొలి సమావేశంలో ఉమ్మడి మ్యానిఫెస్టోపై క్లారిటీ వచ్చింది. నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. అయితే ఇందులో ఏయే అంశాలు ఉంటాయన్న దానిపై ఇవాళ మరింత క్లారిటీ వచ్చింది. టీడీపీ నుంచి ఇప్పటికే ఆరు గ్యారంటీలు ప్రకటించిన నేపథ్యంలో జనసేన నుంచి మరో నాలుగు గ్యారంటీలు కలపాలని పవన్ ప్రతిపాదించారు.
టీడీపీ-జనసేన తరఫున ఉమ్మడిగా నవంబర్ 1న విడుదల చేయబోయేది మినీ మ్యానిఫెస్టోనే అనేది తేలిపోయింది. కర్నాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలతో సక్సెస్ అయిన నేపథ్యంలో మ్యానిఫెస్టోను పేజీలకు పేజీల బదులు సాధ్యమైనంత చిన్నదిగానే ఉంచి జనాలకు అర్ధమయ్యేలా ఉంచాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో టీడీపీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడు మరో నాలుగు గ్యారంటీలు చేర్చాలని పవన్ కోరగా.. టీడీపీ అంగీకరించింది.

ఈ నేపథ్యంలో పవన్ ప్రతిపాదించిన నాలుగు గ్యారంటీల్ని ఓసారి గమనిస్తే ఇందులో భవన నిర్మాణ కార్మికులకు ఓ హామీ, రైతులకు మరో హామీ, యువతకు ఇంకోటి, సబ్ ప్లాన్ నిధుల అంశం ఉన్నాయి. ఈ నాలుగు పాయింట్లు కలిపితే టీడీపీ ఆరు గ్యారంటీలకు మొత్తం 10 గ్యారంటీలతో మినీ మ్యానిఫెస్టో విడుదల చేయొచ్చని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు 10 హామీలతో నవంబర్ 1న మినీ ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తారు.
అనంతరం నవంబర్ 1 నుంచే 160 రోజుల పాటు ఈ మ్యానిఫెస్టో హామీల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఇరు పార్టీల నాయకులు, క్యాడర్ జనంలోకి ఇంటింటికీ వెళ్తారు. ఇందులో ఎలాంటి గ్యాప్ రాకుండా రాష్ట్ర స్ధాయితో పాటు క్షేత్రస్దాయిలోనూ ఇరుపార్టీల నేతలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటిలో ఎప్పటికప్పుడు మ్యానిఫెస్టో అంశాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాన్ని చర్చించుకుంటారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక పూర్తిస్ధాయిలో ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications