13న టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ-17 నుంచి ఉమ్మడిగా భవిష్యత్ గ్యారంటీ..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విపక్ష పార్టీలు టీడీపీ-జనసేన ఇవాళ విజయవాడలో రెండోసారి భేటీ అయ్యాయి. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 13న మేనిఫెస్టో కమిటీ సమావేశం, 14, 15, 16వ తేదీల్లో నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 17 నుండి ఉమ్మడిగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపడతారు.
రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని వదిలించడమే టీడీపీ-జనసేన మొదటి టార్గెట్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ నెల 14, 15, 16వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు ఉంటాయని, ఏయే తేదీల్లో ఏ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టాలో త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఈనెల 13న టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం ఉంటుందన్నారు. జనసేన ఇచ్చిన ఐదారు అంశాలను చేర్చి 17 నుండి టీడీపీ-జనసేన కలసి ఉమ్మడిగా భవిష్యత్ గ్యారంటీ ప్రచారం నిర్వహిస్తాయని తెలిపారు.

ఇవాళ నోవోటెల్ హోటల్ లో భేటీ నిర్వహించిన ఇరు పార్టీలు.. ఇలా హోటల్లో జరిగే చివరి సమావేశం ఇదేనని ప్రకటించాయి. ఇక నుండి ప్రతి 15 రోజులకొక సమావేశం జరుగుతుందని, వచ్చే సమావేశాన్ని జనసేన కార్యాలయంలో, తర్వాత టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తామని వెల్లడించాయి. ఇకపై రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు టీడీపీ - జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. చంద్రబాబునాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బహిరంగసభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రసంగిస్తారని తెలిపాయి.
రెండు పార్టీల్లోని అన్ని అనుబంధ విభాగాలు కలిసి ఎక్కడున్నా కలిసి పనిచేస్తాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఉమ్మడి జిల్లాను యూనిట్ గా తీసుకుని ఇటీవల సమావేశాలు నిర్వహించామని, ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మేనిఫెస్టోలో చేర్చాలని కొన్ని అంశాలను ఇచ్చారు..వీటిని కూడా భవిష్యత్ గ్యాంరటీలో చేర్చుతామన్నారు.

రెండు పార్టీల నుండి ముగ్గురు చొప్పున తీసుకుని మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారన్నారు. రెండు పార్టీల మేనిఫెస్టో కమిటీలు ఈ నెల 13న మొదటి సమావేశమవుతాయని, 17 నుండి టీడీపీ - జనసేన భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రతి ఇంటికీ వెళ్తాయని తెలిపారు. రాష్ట్రంలో కరువుపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించి, రైతులు పక్షాన గట్టిగా పోరాడతామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేవరకూ రెండు పార్టీలు పోరాడతాయన్నారు. 18, 19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై క్షేత్రస్థాయిలో ఆందోళన చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications