పవన్‌ను అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతుంది
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.
ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా జనసేన పని చేస్తోందనేది మరోసారి తేటతెల్లమైందని అన్నారు. టీడీపీ- జనసేన ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో అన్ని సీట్లు గెలుచుకుంటామని, కుప్పంలో కూడా విజయం సాధిస్తామని అన్నారు.
ఒక రాజకీయ పార్టీ పెట్టి, తన సామాజికవర్గాన్ని, అభిమానులను ఇలా మోసం చేయడం దారుణమని సజ్జల విమర్శించారు. పవన్ కల్యాణ్‌పై కంటే ఆయనను అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతుందని వ్యాఖ్యానించారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా చంద్రబాబే చెప్తున్నారంటే.. అభ్యర్థులను కూడా ఆయనే డిసైడ్ చేస్తాడేమోనని ఎద్దేవా చేశారు.

24 మందిని పెట్టుకుని పవన్ కల్యాణ్ ఎవరి మీద యుద్ధం చేస్తాడని సజ్జల ప్రశ్నించారు. ఆ 24 మంది అభ్యర్థులు ఎవరో కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని సెటైర్లు వేశారు. చివరికి తాను ఎక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నాడని గుర్తు చేశారు.
కుప్పంలో తాను పోటీ చేస్తానని చంద్రబాబు ప్రకటించుకున్నాడని, పవన్ కల్యాణ్ సీటు ఎక్కడో కూడా నిర్ధారించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటించిన జనసేన అయిదు సీట్లు మినహా మిగిలిన వాటిల్లో అభ్యర్థులు ఎవరనేది చంద్రబాబే డిసైడ్ చేయాలని వ్యాఖ్యానించారు.
ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో జగన్‌ను చూసి నేర్చుకోవచ్చని, ఒక రాజకీయ పార్టీ ఎంత దరిద్రంగా ఉంటుందనేది చూడాలంటే పవన్ కల్యాణ్, జనసేన పార్టీని చూపిస్తే సరిపోతుంది సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పేరు, గాజు గ్లాసు గుర్తు మాత్రం పెట్టుకుని తిరుగుతున్నాడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications