జనం రెడీ- మీరు టికెట్లు ప్రకటిస్తే....చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడు సలహా..
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న విపక్ష పార్టీ టీడీపీ నేతలకు ఇప్పుడో భయం పట్టుకుంది. ప్రతీసారీ ఎన్నికల వరకూ ఆగి చివర్లో టికెట్లు ప్రకటించే సంప్రదాయం టీడీపీలో ఉంది. ఈసారి కూడా అలా చివరి నిమిషంలోనే టికెట్లు ప్రకటించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇవాళ ఆయనకు ఓ కీలక సూచన చేశారు.
ముఖ్యంగా జనసేనతో పొత్తు ఉంటే పలు స్ధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్న భావనలో పార్టీ నేతలు అభద్రతాభావానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులను ప్రకటించాలని చంద్రబాబును ఇవాళ కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్రస్ధాయి సమావేశంలో ఈ మేరకు చంద్రబాబుకు అయ్యన్న కీలక సూచన చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అటువంటప్పుడు టికెట్లు వెంటనే ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. గెలిచే అవకాశం లేకపోతే తనకు కూడా టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అయ్యన్న చంద్రబాబాబుకు నిర్మొహమాటంగా చెప్పేశారు. అలాగే గతంలోలాగానే మూడు జిల్లాలకు ఓ ఇన్‌చార్జ్‌ను నియమించాలని కూడా చంద్రబాబు ఆయన సూచించారు. జనసేనతో పొత్తు కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై వస్తున్న విమర్శలపైనా అయ్యన్న స్పందించారు. రావణుడిని వధించే శక్తి రాముడికి ఉన్నా.. వానరులు, ఊడత, రావణుని తమ్ముడి సాయం తీసుకున్న విషయాన్ని అయ్యన్న టీడీపీ నేతలకు గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications