కొడాలి నాని వ్యాఖ్యల్ని స్వాగతించిన బుద్ధా వెంకన్న..!
ఏపీలో చంద్రబాబు అరెస్టు, జైలు నేపథ్యంలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా చంద్రబాబు ను జైలుకు వెళ్లాక చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఇవాళ యాత్ర ప్రారంభించారు. దీన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చేతకాని వాడు కాబట్టే భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు అరెస్టు కావడంతో భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని, లోకేష్ చేతకాని వాడు కాబట్టి యాత్ర చేయడం లేదన్నారు. అలాగైతే జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల యాత్ర చేశారు కాబట్టి ఆయన చేతకాని వాడా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. అది నిజమైతే ఇప్పుడు కొడాలి వ్యాఖ్యల్ని తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 175 సీట్లు సాధిస్తామని చెబుతున్న వైసీపీకి 15 సీట్లు కూడా రావని వారి లెక్కల్లేనే తేలిపోయిందన్నారు.

నారా భువనేశ్వరి ఆమె తండ్రి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, భర్త చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కానీ పాలనలో వేలు పెట్టినట్లు సాక్షి పత్రికలో కూడా రాయలేకపోయారని బుద్ధా వెంకన్న తెలిపారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాతే ఆమె శివంగిలా బయటికి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే అర్హత కొడాలి నానికి లేదన్నారు. ఎన్టీఆర్ గారాల పట్టి అయిన భువనేశ్వరి రోడ్లపైకి వస్తే దాన్ని జీర్ణించుకోలేక కొడాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ మీకు దేవుడు అయితే ఆయన కుమార్తె భువనేశ్వరి ఆయన కుమార్తె దేవత ఎందుకు కాదని కొడాలి నానిని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్ ను ఏదోలా మెప్పించి తిరిగి మంత్రి పదవి తెచ్చుకునేందుకే కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని రోజూ మైకు ముందుకు వచ్చి ఏదో పిచ్చివాగుడు వాగుతుంటే జనాలు ఏమనుకుంటున్నారో ఓసారి తెలుసుకోవాలని బుద్ధా వెంకన్న సూచించారు.












Click it and Unblock the Notifications