విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్టింగ్‌కు మళ్లీ టీడీపీ అడ్డంకులు?
అమరావతి: సాగరనగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే కార్యక్రమాలకు న్యాయపరమైన అడ్డంకులు తప్పట్లేదు. అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించడాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. హైకోర్టుల్లో పలు పిటీషన్లను వేసింది. అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన ఉద్యమానికీ సారథ్యాన్ని వహించింది.
తెలుగుదేశం పార్టీ సృష్టించిన అడ్డంకుల వల్ల విశాఖకు సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాలను తరలించడంలో జాప్యం ఏర్పడుతూ వచ్చింది. వాటన్నింటినీ అధిగమించి ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్యాంప్ కార్యాలయాన్ని తరలించడానికి ప్రభుత్వం తన చర్యలను మళ్లీ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టింది.

అటు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. క్యాంప్ కార్యాలయం తరలింపు పనులను పర్యవేక్షించడానికి, వీటిని మరింత ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే జీవో నంబర్ 2015ను విడుదల చేసింది.
మున్సిపాలిటీ- పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇందులో సభ్యులు. క్యాంప్ కార్యాలయ తరలింపు ఏర్పాట్లన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. క్రమంగా- అన్ని శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయి. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విశాఖకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకుడు లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2015 జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రుషికొండ వద్ద ప్రభుత్వం చేపట్టిన భవన నిర్మాణ పనులతో పాటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవంపై స్టే ఇవ్వాలని కోరారు.
రుషికొండపై నిర్మాణాలను చేపట్టడం- కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘించినట్టేనని లింగమనేని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన పిటీషన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. రుషికొండ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications