నన్ను క్షమించు నాన్నా: దేవాన్ష్‌కు సారీ చెప్పిన నారా లోకేష్..!!
తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇవ్వాళ శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కలిసి నడిచారు.
పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 49వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. సోమవారమే ఆయన కదిరిలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

కదిరి నియోజకవర్గంలో..
స్వర్ణకార సంఘం, ఆర్యవైశ్య ప్రతినిధులను నారా లోకేష్ కలుసుకున్నారు. కదిరిలోని పీవీఆర్ గ్రాండ్ వద్ద నిర్వహించిన సమావేశాలలో ముస్లింలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానికులు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలు ఎంతో వెనుకబడ్డారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

కెనాల్స్ పరిశీలన..
ఇవ్వాళ కదిరి మండలంలోని బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. బ్రాంచ్ కెనాళ్లను పరిశీలించారు. ఈ కెనాల్ ద్వారా చిత్తూరు జిల్లాకు మంచినీరు, సాగునీరు వెళ్తుందని, చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పూర్తి చేసిందని అన్నారు. తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలకు మంచినీరు, సాగునీటిని అందించారని చెప్పారు. నదుల అనుసందానం ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తీసుకొచ్చారని అన్నారు.

టీటీడీకి విరాళం..
ఇవ్వాళ నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నారా లోకేష్ కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానానికి 33 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ప్రతి సంవత్సరం దేవాన్ష్ బర్త్ డే నాడు టీటీడీకి విరాళం ఇవ్వడాన్ని ఆనవాయితీగా పాటిస్తోంది ఆయన కుటుంబం. ఇందులో భాగంగా ఇవ్వాళ కూడా 33 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చింది. నిత్యాన్నదానంలో ఒక రోజు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆయన కుటుంబం భరిస్తోంది.

దేవాన్ష్ కు సారీ..
దేవాన్ష్ పుట్టినరోజును నారా లోకేష్ సెలబ్రేట్ చేసుకోలేదు. యువగళం పాదయాత్రలో ఉన్నందున హైదరాబాద్ కు వెళ్లలేకపోయారు. కుమారుడి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు ఆయన అందుబాటులో లేకుండా పోయారు. దీనితో- దేవాన్ష్ కు నారా లోకేష్ సారీ చెప్పారు. తనను క్షమించాలని కోరారు. నీతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోలేకపోతున్నందుకు క్షమించు నాన్నా అని చెప్పారు. తన ఆశీస్సులు ఎప్పుడూ దేవాన్ష్ తోనే ఉంటాయని, వేల కొద్దీ శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు. మిస్ యు బడ్డీ- అంటూ నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. దేవాన్ష్ తో కలిసి దిగిన ఫొటోను దానికి జత చేశారు.












Click it and Unblock the Notifications