ప్రశాంత్ కిశోర్ వ్యూహం: చంద్రబాబు సభల్లో ఆ 11 మందినీ వైసీపీ వాళ్లే చంపేశారు- నారా లోకేష్
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించిన ఉదంతం- ఆ పార్టీని రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. మొన్నటికి మొన్న కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ఎనిమిది మంది మృతి చెందడం- దాన్ని విస్మరించకముందే తాజాగా గుంటూరులో చేపట్టిన చంద్రన్న కానుకల పంపిణీ సభలో మరో ముగ్గురు మహిళలు చనిపోవడం దుమారాన్ని రేపుతోంది.

డిఫెన్స్ లో టీడీపీ..
కందుకూరు, గుంటూరుల్లో ఏకంగా 11 మంది మరణించడం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కందుకూరు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్పందించడం, మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ప్రకటించడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కందుకూరు తొక్కిసలాట అంశాన్ని జాతీయ మీడియా ప్రయారిటీ ఇచ్చింది.

గుంటూరుపైనా అదే తీవ్రత..
సరిగ్గా మూడు రోజుల వ్యవధిలో గుంటూరులో మళ్లీ అదే చంద్రబాబు సభలో తొక్కిసలాటలో ముగ్గురు మృత్యువాత పడిన ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఇక ఎదురుదాడికి దిగింది. కందుకూరులో కాల్వలో పడి ఎనిమిది మరణించడాన్ని ప్రభుత్వం, పోలీసుల లోపాలుగా ఎత్తి చూపింది టీడీపీ. గుంటూరు తొక్కిసలాటను కూడా ప్రభుత్వం మెడకే చుట్టేసింది.

ప్రభుత్వ హత్యలే..
కందుకూరులో ఎనిమిది మంది, తాజాగా గుంటూరులో ముగ్గురు మరణించడాన్ని ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఈ మేరకు కొద్ది సేపటి కిందటే వరుస ట్వీట్లు చేశారు. ఆయా హత్యలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాల్లో భాగమేనని విమర్శించారు. దీనికి తగిన మూల్యాన్ని వైఎస్ఆర్సీపీ చెల్లించాల్సి ఉంటుందని, అన్నీ లెక్క పెట్టుకుంటున్నామని హెచ్చరించారు.

శకుని వ్యూహాలు..
ఇదివరకు చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో జగన్ జరిగిన కోడి కత్తితో దాడి, తిరుమలలో పింక్ డైమండ్ మాయం కావడం, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం.. వాటన్నింటికీ జగనే కారకుడని నారా లోకేష్ ఆరోపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శకుని వ్యూహాల్లో భాగమని విమ్శించారు. ప్రశాంత్ కిశోర్ శకుని వ్యూహాల్లోంచి వచ్చిన మరో క్రూర వ్యూహం వల్ల తొక్కిసలాట జరిగిందని అన్నారు.

వైసీపీ వాళ్లే చంపేశారు..
చంద్రబాబు కందుకూరు సభ, ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ సభలో జరిగింది తొక్కిసలాట కాదని, వైసీపీ సర్కారు పాల్పడిన మారణహోమమని నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఈ రెండు ఘటనల్లో వారు చనిపోలేదని, వైసీపీ వాళ్లే చంపేశారని నారా లోకేష్ మండిపడ్డారు. తన తండ్రి మరణానికి రిలయన్స్ యాజమాన్యమే కారణమంటూ అప్పట్లో ప్రజలను రెచ్చగొట్టి, ఇప్పుడు వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన మేకవన్నె పులి జగన్ రెడ్డి అని విమర్శించారు. ఓట్ల కోసం సొంత బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన క్రూరుడు జనాన్ని కనికరించి వదిలేస్తాడు అనుకోవడం పొరపాటని అన్నారు.












Click it and Unblock the Notifications