వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
అసలే వేసవికాలం. పైగా దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి. రోజురోజుకీ పదునెక్కుతోన్న నాయకుల మాటలు. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అందులో ఏపీ రాజకీయాలైతే ఇక వేరే చెప్పక్కర్లేదు. ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీలు ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా ఇక చెడుగుడాడేసుకుంటున్నారు. ఈ వార్‌కు వేదికగా నిలుస్తోంది సోషల్ మీడియా. తాజాగా టీడీపీ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సోషల్ మీడియాకు చిక్కారు. ఇంతకీ లోకేష్ ఏం చేశారనేగా మీ డౌటు..?
ఏప్రిల్ 29వ తేదీ శుభ శుక్రవారం (Good Friday). గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు. ఈ రోజున క్రైస్తవులందరూ క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి ప్రార్థనలు చేస్తుంటారు. క్రీస్తు సిలువపై వ్రేలాడుతూ పలికిన ఏడు మాటలను గుర్తు చేసుకుంటూ ప్రార్థనలో గడుపుతారు క్రైస్తవులు. అంతేకాదు భస్మ బుధవారం ఉపవాసంతో ప్రారంభమై గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసాలకు ముగింపు పలుకుతారు.

అయితే టీడీపీ యువనేత నారా లోకేష్ ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 7 గంటల 40 నిమిషాలకు ఓ ట్వీట్ వేశారు. క్రైస్తవులకు పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలంటూ ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ట్వీట్ వేసిన కొన్ని నిమిషాలకే వైసీపీ సోషల్ మీడియా కంట పడింది. అంతే వైసీపీ సోషల్ మీడియా సైన్యం ట్విటర్ పై ఏకదాడి మొదలెట్టేసింది.

గుడ్ ఫ్రైడే శుభాంకాంక్షలు చెప్పడమేంటంటూ దీనికి పలువురు కామెంట్ చేశారు. మరికొందరు తమకు తోచిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఇది గమనించిన లోకేష్ వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేశారు. "దయామయుడైన ఏసుక్రీస్తు త్యాగమే గుడ్ ఫ్రైడే. తన జీవితాన్ని ప్రపంచానికి గొప్ప సందేశంగా అందించారు జీసస్. ప్రభువు చూపిన ప్రేమ కరుణ, క్షమ, త్యాగ మార్గాన్ని అనుసరిద్దాం" అంటూ ట్వీట్ చేశారు.ఈ ఎడిట్ చేసిన ట్వీట్ పై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. మొత్తానికి కొంతకాలంగా మంగళగిరిలోనే ఉంటూ ప్రచారం చేసుకుంటున్న నారా లోకేష్ మళ్లీ ఒక్క ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications