ఉమ్మడి చిక్కు, గవర్నర్‌కు రివర్స్: నిన్నటీఆర్ఎస్, నేడు టీడీపీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) గవర్నర్ నరసింహన్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు తెలంగాణ లేదా తెరాస నేతలు మండిపడితే, ఇప్పుడు ఏపీ లేదా టీడీపీ నేతలు ఆయన పైన భగ్గుమంటున్నారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన టీడీపీ నేతలు గవర్నర్ పైన ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇలాంటి సమయంలో తమ ఫోన్లు ట్యాప్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే గవర్నర్ తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం ఓ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసినప్పుడైనా గవర్నర్ స్పందించకుంటే ఎలా అంటున్నారు. ఉమ్మడి రాజధానిలో చట్ట ప్రకారం వెళ్లేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌ది అంటున్నారు.

ఇతర రాష్ట్రాల గవర్నర్‌లు ఎలా వ్యవహరిస్తున్నారో కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు.
సీమాంధ్ర ప్రజలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తున్నారన్నారు. గవర్నర్ తనకున్న అధికారులు ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ పైన కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.
కాగా, రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఇదే గవర్నర్ నరసింహన్ పైన దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. ఓ సమయంలో అసెంబ్లీలోనే గవర్నర్ చేతిలో ఉన్న కాగితాలను చించేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.












Click it and Unblock the Notifications