వైసీపీ చేతికి సరైన టైంలో బ్రహ్మాస్త్రం? ఆ ఒక్క నిర్ణయంతో..!
ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఓవైపు చురుగ్గా దర్యాప్తు జరిపిస్తోంది. అదే సమయంలో ఓ కీలక అంశంలో టీడీపీ నేతలే తప్పు చేసి దొరికిపోవడంతో వారిపై పార్టీ అధినేత చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేయక తప్పలేదు. ఇప్పుడు ఈ అంశం వైసీపీకి రాజకీయంగా ఊరటనిచ్చేలా కనిపిస్తోంది.
తాజాగా కల్తీ మద్యం ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నేతలపై వేటు వేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాయలసీమతో పాటు దక్షిణాంధ్ర జిల్లాలకు సంబంధం ఉన్న ఈ కల్తీ మద్యం ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. అదే సమయంలో ఈ ఘటనకు బాధ్యులైన టీడీపీ నేతలపై అధినేత చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిపై సస్పెన్షన్ వేటు వేయించేశారు. తద్వారా తప్పు చేస్తే ఎంతటి నేతల్ని అయినా వదిలిపెట్టబోమన్న సందేశం ఇచ్చారు.

అయితే టీడీపీ అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూటమి సర్కార్ కు మేలు చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ వ్యవహారం బూమరాంగ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఓవైపు వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సీఐడీ సిట్ విభాగం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. అలాగే ఈ కేసులో నిందితులకు తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది కూడా. ఇలాంటి సమయంలో తమ పార్టీ నేతలు కల్తీ మద్యం కేసులో దొరికిపోవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

ముఖ్యంగా వైసీపీ హయాంలో 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం చోటు చేసుకుందని, ఇందులో వైసీపీ అధినేత జగన్ కు డబ్బులు చేరాయని కొంతకాలంగా కూటమి పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సిట్ దర్యాప్తులోనూ జగన్ పేరును ప్రస్తావించినా ఇప్పటివరకూ ఆయన్ను నిందితుడిగా మాత్రం చేర్చలేదు. ఇలాంటి సమయంలో కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు ఇరుక్కోవడం, వారిని సస్పెన్షన్ చేయడం ఆ పార్టీకి కలిగించే ప్రయోజనం కన్నా వైసీపీకి రాజకీయంగా పనికొచ్చేలా కనిపిస్తోంది. ఇవాళ వైసీపీ నేత పేర్నినాని విమర్శలు చూస్తుంటే వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications