శరవేగంగా టీడీపీ మహానాడు ఏర్పాట్లు.. మహానాడులో తీర్మానాలపై 26న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం!!
తెలుగుదేశం పార్టీ ఒంగోలు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహించనుంది. ఈ నెల 27, 28 తేదీలలో టిడిపి మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు భారీగా నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒంగోలు నగర శివారులో వందెకరాల స్థలాన్ని సేకరించిన టిడిపి మహానాడు కోసం దీనిని తీర్చిదిద్దుతుంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ గా మహానాడు కార్యక్రమం నిర్వహించగా ఈ దఫా బహిరంగ సభను నిర్వహించి, ఇప్పటి నుంచే ఎన్నికల కార్యక్షేత్రంలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని టిడిపి నిర్ణయించింది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి వంటి ముఖ్యమైన ఘట్టాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పదివేల మంది ప్రతినిధులతో మహానాడును నిర్వహించనుంది. తొలిరోజు ప్రతినిధుల సభ, రెండవ రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆమోదించవలసిన తీర్మానాలపై ఈ నెల 26వ తేదీన అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు.

27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహానాడు సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, ఇతర అంశాలపై కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహానాడు వేదికగా చేయవలసిన పలు కీలక ప్రకటనలు, రాబోయే ఎన్నికలలో యువత, మహిళలకు ప్రాధాన్యత నివ్వడం, ఇతరత్రా అంశాలపై కూడా చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరు, ఏపీలో ముందస్తు ఎన్నికల అవకాశం, ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై పోలిట్ బ్యూరోలో ప్రస్తావించనున్నారు.
ఇక మహానాడు ఏర్పాట్లు ఈనెల 25వరకు పూర్తి చేసేలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒకపక్క చంద్రబాబు బాదుడే బాదుడు ల్లాల యాత్రలు కొనసాగిస్తూనే మరోపక్క మహానాడు ఏర్పాట్లను మానిటర్ చేస్తున్నారు. మొత్తంగా మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది.