టీడీపీకి భారీ విరాళాల రికార్డ్.. అత్యధిక విరాళం ఇచ్చింది ఆమెనే!
తెలుగుదేశం పార్టీ ప్రతీ సంవత్సరం నిర్వహించే టీడీపీ మహానాడు 2026 ఘనంగా నిర్వహించిన సందర్భంగా పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు వ్యాపారవేత్తల నుంచి పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయి. ఈ మహానాడు కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి మరియు కార్యకలాపాల కోసం నాయకులు తమ సామర్థ్యానికి మించి సహాయం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై నుంచి విరాళాలు అందించిన వారి పేర్లను ప్రకటించి, వారందరినీ అభినందించారు.
రెండు రోజుల్లో టీడీపీ మహానాడులో రూ.25.61 కోట్ల విరాళాలు
రెండు రోజుల్లో మొత్తం రూ.25.61 కోట్ల విరాళాలు సేకరించినట్లు చంద్రబాబు వెల్లడించారు. మొదటి రోజు రూ.12.44 కోట్లు, రెండవ రోజు రూ.13.17 కోట్లు వచ్చాయని తెలిపారు. ఈ విరాళాల్లో నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కలిసి రూ.5 కోట్లు ఇచ్చి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన రాజగోపాల్ రూ.1.50 కోట్లు విరాళం అందించారు.

టీడీపీకి పార్టీ నేతలు, ప్రముఖులు ఇచ్చిన విరాళాలు ఇలా
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, నారాయణ విద్యా సంస్థలు తలా రూ.1 కోటి చొప్పున సహాయం చేశారు.
తిరుపతి జిల్లా పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ రూ.50 లక్షలు, ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ రూ.27 లక్షలు, టీడీపీ నేత శంకర్ రెడ్డి రూ.25 లక్షలు ఇచ్చారు.
పోటీ పడి విరాళాలిచ్చిన ఎమ్మెల్యేలు
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రూ.19 లక్షలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రూ.15 లక్షలు విరాళాలు ఇచ్చారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వంటి నేతలు రూ.10 లక్షలు చొప్పున అందించారు.
స్వంత ఆదాయం నుంచి పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్న నాయకులు
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ.5 లక్షలు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వంటి నాయకులు కూడా గణనీయమైన మొత్తాలు విరాళంగా ఇచ్చారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ నేతలు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారులు తమ స్వంత ఆదాయం నుంచి పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డారు.చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీ కోసం నేతలు, కార్యకర్తలు వివిధ రూపాల్లో సేవ చేస్తున్నారన్నారు.
టీడీపీలో ఉన్న ఐక్యత, బలమైన మద్దతుకు విరాళాలే నిదర్శనం
కొందరు సోషల్ మీడియాలో, కొందరు క్షేత్రస్థాయిలో, మరికొందరు ఆర్థిక సహాయంతో ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది అని ప్రశంసించారు. ఈ విరాళాల సేకరణ టీడీపీలో ఉన్న ఐక్యత మరియు నాయకుల నుంచి ఉన్న బలమైన మద్దతును ప్రతిబింబిస్తోంది. మహానాడు సందర్భంగా ఇలాంటి ఆర్థిక సహాయం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications