హోదా ఎఫెక్ట్: కేంద్రానికి పత్తిపాటి హెచ్చరిక, బీజేపీ రాజ్యసభకు బాబు ఎసరు?
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం నాడు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండే ప్రజాభీష్టం మేరకు తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీకి హెచ్చరికలు పంపించారు.
భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ ఇవ్వాలా వద్దా అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయమని చెప్పారు. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి వైసిపికి, మూడు టిడిపికి దక్కే అవకాశం ఉంది. బీజేపీ మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీకి ఒకటి ఇస్తారని చెబుతున్నారు.
అయితే, ఇప్పుడు మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యల ద్వారా బీజేపీకి రాజ్యసభ ఇచ్చే అవకాశాల పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీకి ఓ రాజ్యసభ ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో హోదా విషయంలో బీజేపీని హెచ్చరించేలా మాట్లాడటం గమనార్హం.
వైసిపి అధినేత జగన్ విషయమై మాట్లాడుతూ... తాము సంఖ్యా బలంగా తక్కువగా ఉన్నప్పటికీ నాలుగో స్థానం కూడా గెలుచుకుంటామని చెప్పారు. నాలుగో స్థానానికి పోటీ పైన మాత్రం నిర్ణయం చంద్రబాబుదే అన్నారు. కేసుల భయం తమకు లేదని, జగన్‌కే ఉందని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎదురుదాడి
ఇప్పటికే బీజేపీ నేత సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ పైన ఒంటికాలిపై లేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గురువారం నాడు టిడిపిపై మనండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ప్రధాని మోడీకి పేరు వస్తుందని టిడిపికి భయం పట్టుకుందన్నారు.
అందుకే పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదన్నారు. బీజేపీతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే నేరుగా చెప్పాలని టిడిపి నేతలకు సూచించారు. చంద్రబాబును చూసి మోడీ భయపడుతున్నారని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications