స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు: వీధి రౌడీలు,సంస్కారం లేనోళ్ళని జగన్ ఫైర్
Recommended Video
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. మూడు రాజధానుల వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఓవైపు రైతు భరోసా కేంద్రాలపై సభలో చర్చ కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో టీడీపీ సభ్యులు మూడు రాజధానుల వ్యవహారంపై సభలో చర్చ పెట్టాలని ఆందోళన కొనసాగిస్తూనే స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు.

రాజధాని అమరావతి నినాదాలతో స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ నాయకులు
టీడీపీ సభ్యులు ఏపీ అసెంబ్లీ మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సభలో రాజధాని అమరావతిపై చర్చ పెట్టాలని పట్టు పడుతూ అమరావతి నినాదాలు కొనసాగిస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు. దీంతో మరోసారి టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. టీడీపీ సభ్యులు ఇలా ప్రవర్తిస్తే సభ నడపలేమని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ ఫైర్
టీడీపీ సభ్యుల కంటే వీధి రౌడీలు చాలా బెటర్ అని జగన్ అన్నారు . టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు రెచ్చిపోయేలా చేసి ఆ తర్వాత దాడి చేస్తే ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు .

రింగ్ దాటి వస్తే మార్షల్స్ ఎత్తుకెళ్లేలా స్పీకర్ కు సీఎం సూచన
సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కావటం లేదని పేర్కొన్నారు . సభ్యులు స్పీకర్ పోడియం రింగ్ దాటి వస్తే మార్షల్స్ ఎత్తుకెళ్లేలా సూచించాలని సభాపతికి సీఎం తెలిపారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే చేతనైతే సలహాలు ఇవ్వాలి, అలా చేతకాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు ఏదో ఒక రభస చెయ్యటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు ఏపీ సీఎం జగన్ .












Click it and Unblock the Notifications