ఏడ్చేసిన బొత్స-వైఎస్సార్ మృతిపై అచ్చెన్న వ్యాఖ్యలతో..!
ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ దివంగత వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వైసీపీ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) వైఎస్సార్ మరణం(ysr death), జగన్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) ఆ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
వైఎస్‌ఆర్ మరణానికి జగన్ మోహన్ రెడ్డి కారణమని గతంలో వ్యక్తమైన అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ నైజం చూస్తుంటే నాడు మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు, వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే అన్నారు. పదవి కోసం జగన్ మోహన్ రెడ్డి సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాడన్నారు. జగన్ కు ఇక అధికారం రాదని, ప్రజలకు ఆయన పిచ్చిచేష్టలు తెలిసిపోయాయంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. వైఎస్ మరణం రోజున జగన్ విదేశాల్లో ఉన్నాడంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ రోజు జరిగిన ఘటనలకు తానే ప్రత్యక్ష సాక్షిని అన్నారు. పార్టీలో ఉనికిని కాపాడుకునేందుకు అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారాలా అని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ రెడ్డితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బొత్స సత్యనారాయణ భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను రాజకీయాలో కోసం అచ్చెన్నాయుడిలా దిగజారలేనన్నారు. వెంటనే అచ్చెన్న తన నీచపు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications